రబీకి రైతు భరోసా ఏదీ?
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:50 AM
రబీ సీజన్ ప్రారంభమై వరి నాట్లు పూర్తి కావస్తున్నా రైతు భరోసా పేరిట ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అన్నదాతలకు అందలేదు. పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నివారించి వారికి అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రారంభించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్): రబీ సీజన్ ప్రారంభమై వరి నాట్లు పూర్తి కావస్తున్నా రైతు భరోసా పేరిట ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం అన్నదాతలకు అందలేదు. పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నివారించి వారికి అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రైతుభరోసాగా మార్చింది కానీ సాయానికి భరోసా మాత్రం ఇవ్వడంలేదని రైతులు విమర్శిస్తున్నారు. వరి సాగులో అత్యధిక దిగుబడులు సాధిస్తూ తెలంగాణ ధాన్యాగారంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు సాధించింది. ఈ రబీ సీజన్‌లో కరీంనగర్ జిల్లాలో 2.72 లక్షల ఎకరాల్లో వరి, 30 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 14 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని సీజన్‌కు ముందే అమలు చేసి పెట్టుబడుల కోసం ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉండగా నాట్లు పూర్తికావస్తున్నా పెట్టుబడి సాయం విడుదల కాలేదు.
ఫ పూర్తికావస్తున్న సాగు
జిల్లాలో ఇప్పటికే రైతులు 1,99,032 ఎకరాల్లో వరి, 26 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 500 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు. వ్యవసాయశాఖ అంచనా వేసిన మేరకు ఈనెలాఖరుకు వరి నాట్లు, ఇతర పంటల సాగు పూర్తికానున్నది. వరి సాగు చేసిన రైతులు పొలం దున్ని నాట్లు వేయడానికి, ఎరువులు చల్లడానికి ఎకరాకు సుమారు 13 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. నాట్లు వేసిన 15 రోజుల్లో యూరియా వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు 1,99,032 ఎకరాలకు సుమారు 258.74 కోట్ల రూపాయలు, మొక్కజొన్న రైతులు 18.20 కోట్లు వెచ్చించారు. రైతు భరోసా పథకం కింద సాయం అందుతుందని ఎదురు చూస్తున్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఏ చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఎప్పుడు నిధులు విడుదల చేసేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. గత సంవత్సరం రబీ సీజన్‌లో జిల్లాలోని 1,65,850 మంది రైతులకు 133.62 కోట్ల రైతుభరోసా సాయం అందింది. ఈ వానాకాలం సీజన్‌లో 1,90,106 మంది రైతులకు 206.62 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఈసారి కూడా ప్రభుత్వం ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి కోసం రైతుభరోసా నిధులు విడుదల చేస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రభుత్వం అందించే ఆరువేల రూపాయలు పెట్టుబడులకు పూర్తిగా సరిపోకపోయినా ఎరువులు, విత్తనాలైనా కొనుక్కోవచ్చని ఆశించారు. వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తే నాట్ల తర్వాత వేయాల్సిన ఎరువులైనా కొనుక్కోవడానికి అప్పు చేయాల్సిన అవసరం ఉండదని రైతులు అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని వారు కోరుతున్నారు.