కొనుగోలు కేంద్రాలపైనే యాభై రోజులు దృష్టి సారించా
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:00 AM
నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి, మొక్కజొన్న కేంద్రాలపై 50 రోజులు దృష్టి పెట్టానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 66 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
కాల్వశ్రీరాంపూర్, జూన్ 9(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి, మొక్కజొన్న కేంద్రాలపై 50 రోజులు దృష్టి పెట్టానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన 66 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. విప్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఎన్ని కుట్రలు చేసినా రైతులు ఎక్కడా స్పందించలేదని, బీఆర్‌ఎస్ నాయకుల మాటలు రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప రైతులకు ఒరిగింది ఏమీలేదన్నారు. పేదలకు ఎన్ని ఇళ్లు పంచారో లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో 4.5 లక్షల ఇం దిరమ్మ గృహాలను మంజూరు చేసి పేదల సొంతింటి కల నెరవేర్చిం దన్నారు. నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జూన్ చివరి నాటికి రెండో విడత కింద అద నంగా 2వేల ఇళ్లను ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. గ్రామాల్లో జనాభాను బట్టి పేదలను గుర్తించి ఇళ్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మృగశిర కార్తె ప్రారంభమైందని, రైతులు ఆలస్యం చేయకుండా నార్లు పోసుకోవాలన్నారు. వరికి ప్రత్యామ్నయంగా పత్తి, మొక్కజొన్న, కందులు సాగు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడు తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే కేంద్ర ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నులకే ఇండెంట్ ఇచ్చిందన్నారు. రైతుభరోసా నాలుగు విడతలుగా ప్రభుత్వం ఇచ్చిందని, రైతుభరోసా ఇవ్వలేదని బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75 శాతం మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణామాఫీ జరిగిందన్నారు. తెలంగాణలో తప్ప బోనస్ రైతులకు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. నియోజక వర్గంలో రైతులు 27 వేల మెట్రిక్ టన్నుల మక్కలు పండించారని, వాటి డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో పడుతున్నాయని తెలిపారు. తహసీ ల్దార్ రాముడు, ఎంపీడీఓ దివ్యదర్శన్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.