Share News

కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి పెరిగిన నిధులు

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:17 AM

ఈసారి కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో రాష్ట్రానికి కాస్త ఊరట లభించింది. 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల మేరకు ఆ వాటాలో పెరుగుదల కనిపిస్తోంది.

కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి పెరిగిన నిధులు

  • కేంద్ర బడ్జెట్‌ ప్రకారం రూ.33,180.78 కోట్లు రాక

  • ఆర్థిక సంఘం సిఫారసులతో రూ.1098.90 కోట్ల పెరుగుదల

  • రాష్ట్రం హారిజాంటల్‌ వాటా 2.102 నుంచి 2.174 శాతానికి..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఈసారి కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో రాష్ట్రానికి కాస్త ఊరట లభించింది. 16వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల మేరకు ఆ వాటాలో పెరుగుదల కనిపిస్తోంది. రాష్ట్రానికి మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేసే అన్ని రకాల పన్నుల మొత్తం నుంచి కొంతమేర తిరిగి పంచుతుంది. రాష్ట్రాలకు ఎంత శాతం నిధులు పంచాలో ఆర్థిక సంఘాలు సిఫారసు చేస్తాయి. వెర్టికల్‌గా పాత 41 శాతాన్నే కొనసాగించాలంటూ 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇది ఈ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చి ఐదేళ్ల పాటు 2031 వరకు అమల్లో ఉంటుంది. ఈ 41 శాతాన్ని మళ్లీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వివిధ అంశాల ఆధారంగా హారిజాంటల్‌గా పంచాల్సి ఉంటుంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మొత్తం రూ.15,26,255 కోట్లు కేటాయించింది. ఇందులో హారిజాంటల్‌ పంపక శాతం 2.174 ప్రకారం రాష్ట్రానికి రూ.33,180.78 కోట్లు రానున్నాయి. 2021-26 మధ్య కాలంలో అమల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి 2.102 శాతాన్ని మాత్రమే సిఫారసు చేసింది. కానీ 16వ ఆర్థిక సంఘం దాన్ని 0.072 మేర పెంచి, 2.174 శాతంగా నిర్ధారించింది. 2.102 శాతం ప్రకారమైతే... రాష్ట్రానికి రూ.32,081.88 కోట్లు మాత్రమే వచ్చేవి. 0.072 శాతం పెరగడం వల్ల అదనంగా రూ.1,098.90 కోట్లు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణ, పన్నుల వసూళ్లు, విద్యుత్తు సంస్కరణలు వంటి వాటిలో మెరుగైన ఫలితాలు సాధించడంతో 16వ ఆర్థిక సంఘం పన్నుల వాటా శాతాన్ని 0.072 మేర పెంచింది. దీంతో కేంద్ర పన్నుల్లో వాటా కింద మొత్తం రూ.33,180.78 కోట్లు సమకూరడం రాష్ట్రానికి కాస్త ఉపశమనమే. కాగా.. 2025-26లో కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.29,899 కోట్లు రావాలి. కానీ నికరంగా రూ.21,195.18 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పొందుపర్చింది. డిసెంబరు నాటికి రూ.14,982.82 కోట్లు (70.69ు) విడుదలయ్యాయి. 2025-26లో అంచనా వేసిన రూ.29,899 కోట్ల కంటే ఈ తాజా బడ్జెట్‌లో వస్తాయని అనుకుంటున్న రూ.33,180.78 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రానికి ఈసారి రూ.3,281.78 కోట్లు పెరిగినట్లే.

Updated Date - Feb 02 , 2026 | 03:17 AM