భద్రాద్రిలో రామాలయ అభివృద్ధి పనులు ప్రారంభం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:21 AM
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రామాలయ అభివృద్ధికి...
పూజలు చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్
తొలి విడతలో రూ.200కోట్లతో అభివృద్ధి పనులు
2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం
భద్రాచలం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రామాలయ అభివృద్ధికి రూ.586 కోట్లు కేటాయించగా తొలి విడతలో రూ.200కోట్లతో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. 2027 జూన్‌లో నిర్వహించే గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముందుగా రామకార్యం నిర్విఘ్నంగా సాగాలని ఆకాంక్షిస్తూ మూలవరుల వద్ద అనుజ్ఞ తీసుకొని శ్రీ రామ అష్టోత్తర శతనామార్చనను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ తదితరులు ప్రారంభ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో చేపట్టాలని, చారిత్రక సంప్రదాయాన్ని కాపాడుతూ పనులు కొనసాగించాలని ఎమ్మెల్యే తెల్లం, కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ఆగమ శాస్త్ర నిపుణులు, ఆలయ వైదిక సిబ్బంది సూచనల మేరకు పనులు చేపట్టాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని అధికారులకు సూచించారు.