Share News

రాష్ట్ర అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ సహకరించలేదు

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:12 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సహకరించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాష్ట్ర అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ సహకరించలేదు

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌

వేములవాడ రూరల్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సహకరించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నుంచి నిజామాబాద్‌ జిల్లా సిరికొండ వరకు నిర్మించనున్న డబుల్‌రోడ్డు పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ మూర్ఖపు పాలన వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. గడిచిన ఏడేళ్లలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.22 వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి తీసుకువచ్చామన్నారు. రోడ్ల అభివృద్ధి కోసమే 10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, రూ.2,147కోట్లతో కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారి, రూ.578 కోట్లతో ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఇది సాధ్యం కాలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం సహకరిస్తున్నందున రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 04:12 AM