ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాదు
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:00 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఏదో ఒక రంగానికే మాత్రమే పరిమితం కాలేదు. అన్నింటిలోనూ విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ప్రణాళికాబద్ధంగా ‘ఎకో సిస్టం’ అభివృద్ధి’: మంత్రి శ్రీధర్ బాబు
యశోద ఆస్పత్రిలో ఏఐ ఇన్ హెల్త్ కేర్ 2.0 అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సు
హైదరాబాద్ సిటీ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘కృత్రిమ మేధ (ఏఐ) ఏదో ఒక రంగానికే మాత్రమే పరిమితం కాలేదు. అన్నింటిలోనూ విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా.. రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్యరంగాన్ని చేర్చింది. ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారింది. అయినప్పటికీ ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది’’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలోని తన బ్రాంచిలో నిర్వహించిన ‘ఏఐ ఇన్ హెల్త్ కేర్ 2.0 అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సదస్సు’ను శనివారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హెల్త్‌కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్‌ను ప్రారంభించామని ఆయన తెలిపారు. యశోద ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ జి.ఎస్. రావు మాట్లాడుతూ.. ఆరోగ్యరంగంలో ఏఐ వినియోగం వైద్యసేవల నాణ్యత, వేగం, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తోందన్నారు. రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదని, అది ఆరోగ్యరంగ భవిష్యత్తును పునర్నిర్వచిస్తున్న పరివర్తనాత్మక శక్తి అని పేర్కొన్నారు.