యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో దొంగలు హల్చల్ చేశారు. కొయ్యలగూడెం పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అర్థరాత్రి దొంగలు భారీ చోరీకి విఫలయత్నం చేశారు. ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు, తాము గుర్తుపట్టకుండా ఉండేందుకు తెలివిగా సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే చల్లారు. అనంతరం గ్రిల్స్ తాళాలు విరగ్గొట్టి, వెల్డింగ్ మిషన్ సహాయంతో షట్టర్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, షట్టర్‌ను కట్ చేయగానే ఒక్కసారిగా అలారం మోగడంతో దొంగలు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. సైరన్ శబ్దానికి మేల్కొన్న స్థానికులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు.