భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో అంబులెన్స్‌లో వచ్చి ఓ వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14వ వార్డుకి చెందిన బుక్కూరీ పార్వతీ అనే వృద్ధురాలు కాలు ఫ్యాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరారు. పోలింగ్ సందర్భంగా ఆమెను నేరుగా ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఓటు వేయడానికి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో పోలింగ్ గందరగోళంగా జరుగుతుంది. ఏఎస్ఆర్ నగర్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం, మొత్తం 35 పోలింగ్ కేంద్రాలు ఉండగా కనీసం 10 వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయలేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. దీంతో పోలింగ్ కేంద్రంలోకి వికలాంగులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ.. పోలింగ్ బూత్ గడప వరకు నానా అవస్థలు పడి రావలసిన పరిస్థితి దాపురించిందని అంటున్నారు.