వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దేవస్థానంలో త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సంస్కృత పాఠశాల విద్యార్థుల నగర సంకీర్తన, పంచరత్న గానంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోగా, ఆలయ ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో శాస్త్రీయ సంగీతం, హరికథ, నృత్య రూపకాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలకు పెద్దపీట వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కళాకారులు భారీగా పాల్గొంటున్న ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.