కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎంతో అరుదుగా కనిపించే అడవి జాతికి చెందిన పునుగుపిల్లి ప్రత్యక్షమైంది. స్థానిక పాడా కార్యాలయం ఎదురుగా ఉన్న డివైడర్‌పై ఒంటినిండా రక్తపు గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న ఈ పిల్లిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో చెట్లపై నివసించే ఈ పునుగుపిల్లి, ఆహారం కోసం జనావాసాల మధ్యకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు వెంబడించి దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పునుగుపిల్లిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. దానికి అవసరమైన వైద్య చికిత్స అందించి.. పూర్తిగా కోలుకున్నాక తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అధికారులు వెల్లడించారు.