మంచిర్యాల జిల్లా నస్పూర్ పరిధిలో ఒక చిన్నారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. నస్పూర్ ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పెన్ను క్యాప్‌ను మింగేశాడు. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని గమనించిన వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చాకచక్యంగా ఆ పెన్ను క్యాప్‌ను బయటకు తీశారు. బాలుడు ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన వైద్యులకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.