పుట్టపర్తిలో నూతన సంవత్సర వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంలో న్యూఇయర్ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అయితే ఆ కేకు తిన్న కాసేపటికే విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట ముగ్గురికి, ఆ తర్వాత మరో ఏడుగురికి వరుసగా వాంతులు కావడంతో శిక్షణ కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితులను తక్షణమే పుట్టపర్తిలోని సత్యసాయి జనరల్ ఆసుపత్రికి తరలించారు. ముందుజాగ్రత్తగా కేకు తిన్న సుమారు 40 మందిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన పది మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు బాధితులను పరామర్శించి చికిత్సపై ఆరా తీశారు. కాగా, ఈ కేకును కొత్తచెరువులోని ఒక బేకరీ నుంచి తెచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.