నేటి సమాజంలో రక్తసంబంధాలే అంత్యక్రియలకు మొహం చాటేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కపై చూపిన మమకారం అందరినీ కదిలిస్తోంది. మార్కండేయ కాలనీకి చెందిన అన్నపూర్ణ-భాస్కర్ రెడ్డి దంపతులు 'రియో' అనే కుక్కను గత మూడేళ్లుగా తమ సొంత బిడ్డలా పెంచుకున్నారు. అన్నపూర్ణ కుమారుడు అమెరికా వెళ్తూ కేవలం 20 రోజుల వయసున్న రియోను గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పటి నుండి ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయిన రియో.. ఇటీవల వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. కేవలం అంత్యక్రియలతోనే ఆగకుండా, హిందూ సంప్రదాయం ప్రకారం 11వ రోజున దశదినకర్మ నిర్వహించారు. బంధువులకు, కాలనీ వాసులకు సహపంక్తి భోజనాలు వడ్డించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.