అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో వింతైన, భక్తి పారవశ్యంతో కూడిన 'గోరవయ్యల పాలు పోసే' కార్యక్రమం ఘనంగా జరిగింది. కురుబ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుక భక్తులను అబ్బురపరిచింది. నల్లని కంబళ్లు కప్పుకుని, తల నిండా నెమలి పింఛాల టోపీలు ధరించి, డమరుక నాదాల మధ్య గోరవయ్యలు శివనామ స్మరణతో ఊగిపోయారు. ఈ ఆచారంలో భాగంగా గోరవయ్యలు ఒకరిపై ఒకరు పడుతూ, కుక్కల్లా మొరుగుతూ కింద పోసిన పాలను తాగడం విశేషం. మల్లికార్జున స్వామిని కొలిచే ఈ భక్తులు కుక్కను దైవ స్వరూపంగా భావిస్తూ ఈ వింత ఆచారాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు.