కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్ భర్త చీపురుపల్లి రాఘవ స్థానిక సచివాలయం భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం తన సొంత సొమ్ము రూ.25 లక్షలు ఖర్చు చేశానని, అయితే పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే బిల్లులు ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. బిల్లులు రాకపోవడంతో తాను అప్పుల ఊబిలో కూరుకుపోయానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు తాను కిందకు దిగనని భీష్మించుకోవడంతో అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారు.