పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పసలదీవి గ్రామ పోస్టల్ శాఖలో 30 లక్షల రూపాయల భారీ కుంభకోణం వెలుగుచూసింది. సామాన్య ప్రజలు తమ భవిష్యత్తు అవసరాల కోసం రికరింగ్, సేవింగ్స్ పథకాల్లో దాచుకున్న సొమ్మును పోస్ట్ మాస్టర్ పక్కదారి పట్టించి సొంతానికి వాడుకున్నాడు. ఖాతాదారులు ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నా, వాటిని కార్యాలయ రికార్డుల్లో జమ చేయకుండా కేవలం వారి పాస్ పుస్తకాల్లో మాత్రమే ఎంట్రీలు వేస్తూ నమ్మబలికాడు. ఇటీవల పాస్ పుస్తకాల్లోని వివరాలకు, ఆఫీస్ రికార్డులకు తేడా రావడంతో ఈ మోసం బయటపడింది. తమ కష్టార్జితం మాయమవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు పోస్ట్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోస్టల్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. నమ్మకానికి మారుపేరుగా ఉండాల్సిన వ్యవస్థలో ఇలాంటి అవినీతి జరగడంపై స్థానికులు మండిపడుతున్నారు.