హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికోవర్ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డయాలసిస్ కోసం వచ్చిన గుంటి సాగర్ అనే వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందాడంటూ బాధితుడి బంధువులు ఆసుపత్రి ముందు భారీ ఆందోళనకు దిగారు. సరైన వసతులు లేని, నిర్మాణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించడం వల్లే ప్రాణం పోయిందని మృతుడి తల్లి కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి గేటు ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఇక దీని గురించి సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.