హోలీ అంటే రంగుల పండగ.. కానీ ఆ రంగులు రసాయనాలతో నిండితే ఆరోగ్యం హుష్ కాకి. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మళ్ళీ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. అడవుల్లో విరబూసిన ఎర్రని మోదుగు పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసుకుంటూ పర్యావరణ ప్రేమికులు, వైద్యులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇంజన్ ఆయిల్, కోడిగుడ్లు, రసాయన రంగులతో వికృత చేష్టలకు పాల్పడకుండా.. మోదుగు పూల రంగులతో కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా జరుపుకోవాలని పిలుపునిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వయంగా రంగుల తయారీపై అవగాహన కల్పిస్తూ, భావి తరాలకు మన సంప్రదాయాలను అందిస్తున్నారు. చర్మ వ్యాధుల బారిన పడకుండా, ప్రకృతిని ప్రేమిస్తూ జరుపుకునే ఈ 'నేచురల్ హోలీ' ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.