మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీలోని శిశుమందిర్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 9, 10నంబర్ పోలింగ్ కేంద్రాల సమీపంలో కండువాలు వేసుకుని ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లోకి కాంగ్రెస్ నేతలు కండువాలతో వెళ్లి ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా... బీఆర్ఎస్ నాయకులు గులాబీ కండువాలతో పోలింగ్ కేంద్రంలోకి రావడంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు వారిని బయటకు పంపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పోలీంగ్ కేంద్రం వద్ద బైఠాయించి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.