కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అక్రమ తాబేళ్ల రవాణా బాగోతం బయటపడింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఫారెస్ట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా తాబేళ్లు పట్టుబడ్డాయి. రామచంద్రపురం నుంచి ఒరిస్సా రాష్ట్రానికి ఒక బొలెరో వ్యాన్లో గుట్టుచప్పుడు కాకుండా వీటిని తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. వేల సంఖ్యలో ఉన్న ఈ తాబేళ్లను, వాటిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఏలేశ్వరం రేంజ్ ఆఫీస్కు తరలించారు. అరుదైన జాతులకు చెందిన తాబేళ్లను అక్రమంగా వేటాడి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నట్లు ఏలేశ్వరం రేంజర్ దుర్గా రాంప్రసాద్ తెలిపారు.