మహబూబాబాద్ జిల్లా పాలనలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. జిల్లా పరిపాలన పగ్గాలు భార్యాభర్తల చేతుల్లోకి రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా, హనుమకొండ కలెక్టర్గా ఉన్న స్నేహ శబరీష్ను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. అయితే, ఇప్పటికే అదే జిల్లాలో ఎస్పీగా శబరీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు. సాధారణంగా ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకే జిల్లాలో భార్య కలెక్టర్గా, భర్త ఎస్పీగా శాంతిభద్రతలు, పరిపాలనను పర్యవేక్షించబోతుండటం చూసి జిల్లా ప్రజలు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు.