ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ సమీపంలోనీ ఓ వ్యవసాయ భూమిలో సమాధి తవ్వకం కలకలం రేపుతోంది. ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన వెంకట్ అనే 19 ఏళ్ల యువకుడు గతేడాది మరణించగా.. కుటుంబసభ్యులు అతని మృతదేహాన్ని సొంత వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. అయితే సంవత్సర కాలం తరువాత గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పూడ్చిన స్థలాన్ని తవ్వి.. పుర్రెను తీసుకెళ్లిన ఆనవాలు కనిపిస్తున్నాయి. ఉదయాన్నే వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు పూడ్చిన స్థలం తవ్వివుండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.