కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఫల పుష్ప ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక జి.ఎం.సి బాలయోగి క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో సుమారు పది లక్షల పూల మొక్కలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. బెంగళూరు, పూణే, కడియం ప్రాంతాల నుంచి వచ్చిన విదేశీ గులాబీలు, ఆర్కిడ్స్, బోన్సాయ్ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గత 23 ఏళ్లుగా పర్యావరణంపై అవగాహన కోసం నిర్వహిస్తున్న ఈ వేడుక ఈ ఏడాది 24వ వసంతంలోకి అడుగుపెట్టింది. సేంద్రీయ కూరగాయలు, పెరటి తోటల పెంపకందారులకు పోటీలు నిర్వహిస్తుండటంతో.. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పర్యాటకులు, విద్యార్థులు భారీగా తరలివచ్చి ఈ పుష్ప సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు.