ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట చెరువులో సినీ ఫక్కీలో చేపల దొంగతనం మత్స్యకారులను కలవరపెట్టింది. అర్ధరాత్రి వేళ పడవలు, టార్చిలైట్లతో చెరువులో వేట సాగించిన కేటుగాళ్లు, సుమారు పది క్వింటాళ్ల చేపలను దొంగిలించి ఒడ్డుకు చేర్చారు. గ్రామస్థులు, మత్స్యకారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో దొంగలు చేపల మూటలను వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.