ఆదిలాబాద్ జిల్లాలో విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. జిల్లాలోనే తొలిసారిగా ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక 'కంటైనర్ స్కూల్'ను అందుబాటులోకి తెచ్చింది. కొమురంభీం కాలనీలో ఉండే గిరిజన పిల్లలకు భాషా సమస్య తలెత్తకుండా, వారి మాతృభాషలోనే విద్యాబోధన చేసేందుకు కలెక్టర్ రాజర్షి షా ఈ వినూత్న చొరవ తీసుకున్నారు. ఐటీడీఏ నిధులతో సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో అన్ని వసతులతో ఈ కంటైనర్ పాఠశాలను నిర్మించారు. 30 అడుగుల పొడవున్న ఈ స్కూల్లో ఫ్యాన్లు, లైట్లు వంటి విద్యుత్ సౌకర్యాలను కూడా కల్పించారు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ పాఠశాలను ప్రారంభించగా.. ప్రస్తుతం 20 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి.