భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఓ యువజంట.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఇచ్చిన హామీలను మాత్రం నెరవేరుస్తున్నారు. రాఘవపురం గ్రామానికి చెందిన ముకెర కృష్ణ- ఉషారాణి దంపతులు గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సందర్భంగా గ్రామ ప్రజలకు పలు హామీలను ఇచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమి చెందగా.. నిరాశకు గురికాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధ్యేయంతో గ్రామంలో పలు పనులను వారు తమ సొంత డబ్బులతో చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఓడినా.. హామీలను నెరవేరుస్తున్న కృష్ణను గ్రామస్థులు అభినందిస్తున్నారు.