పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డివిజన్లో కత్తులు కట్టి కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రఘువీర్ విష్ణు హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయంలో 500కు పైగా బైండోవర్ కేసులు నమోదు చేశామని, చట్ట పరిధికి లోబడి సాంప్రదాయబద్ధంగా పందాలు నిర్వహించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి జూదానికి పాల్పడితే సహించేది లేదని, ప్రతి గ్రామంపై నిఘా ఉంచామని తెలిపారు. సంక్రాంతి వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.