శ్రీకాకుళంలో డయేరియా మరోసారి పంజా విసురుతోంది. స్థానిక రెళ్ళవీధిలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహంలో ముగ్గురు విద్యార్థులు డయేరియా లక్షణాలతో అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. తీవ్రమైన వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న విద్యార్థులను గమనించిన హాస్టల్ సిబ్బంది, వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో మొత్తం 240 మంది విద్యార్థులు ఉంటుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు వసతిగృహానికి చేరుకుని, హాస్టల్ పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. విద్యార్థుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు.