కూకట్పల్లి సుమిత్ర నగర్లో మృతి చెందిన మహిళ అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచడం తీవ్ర కలకలం రేపుతోంది. అనారోగ్యంతో రాందేవ్ రావు ఆసుపత్రిలో మరణించిన 45 ఏళ్ల శైలజ మృతదేహాన్ని శుక్రవారం ఇంటికి తెచ్చిన కుటుంబీకులు, పోలీసులు ఎంత చెప్పినా వినకుండా లోపలి నుంచి గడియ పెట్టుకుని ఐస్ బాక్స్‌లోనే ఉంచారు. ఉదయం అంత్యక్రియలు చేస్తామని నిన్న రాత్రి చెప్పినప్పటికీ, నేటికీ తలుపులు తీయకపోవడంతో మృతదేహం నుండి వస్తున్న వాసనతో కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిపించే ప్రయత్నం చేస్తుండగా, అసలు వారు ఎందుకు ఇలా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.