సంక్రాంతి పండుగ వేళ కోడిపందాల జోరు కొనసాగుతుంటే, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామం మాత్రం అందుకు భిన్నంగా నిలిచింది. తమ గ్రామంలో కోడిపందాలు, జూదాలు నిర్వహించకూడదని సర్పంచ్ ముత్యాల అనురాధ నేతృత్వంలో పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. గతంలో పందాల వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా, గ్రామాల్లో అశాంతి నెలకొందని పాలకవర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగరాణికి వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు.. కుప్పనపూడితో పాటు పరిసర గ్రామాల్లో ఎక్కడా పందాలు జరగకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు. జూద రహిత గ్రామాలుగా నిలిపేందుకు వీరు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.