హిందూపురంలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... రాజకీయాలకు అతీతంగా తన మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని శ్రీకంఠపురం ప్రాంతానికి చెందిన సంధ్య అనే సామాన్య టీడీపీ మహిళా కార్యకర్త కోరికను మన్నించి, ఆమె నడుపుతున్న 'టీ డే చాయ్ సెంటర్'కు వెళ్లారు. గతంలో తాను టీ సెంటర్ ప్రారంభించినప్పుడు మీరు తప్పకుండా రావాలని సంధ్య కోరగా, ఆమెపై ఉన్న అభిమానంతో బాలకృష్ణ స్వయంగా చాయ్ సెంటర్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సంధ్య కుటుంబ సభ్యులు బాలయ్యకు హారతి పట్టి ఘనస్వాగతం పలికారు. సంధ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించిన బాలయ్య..వ్యాపారం ఎలా సాగుతోందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే టీ తాగి, ఒక సాధారణ కార్యకర్త పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. కార్యకర్తకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బాలయ్య తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.