పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి లంచం తీసుకుంటున్న పోలీసులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గంగవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై వెంకటేష్, స్టేషన్ రైటర్ వీరబాబు ఒక కేసు విషయంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. నెల్లిపూడికి చెందిన దాసరి శివకుమార్ అనే వ్యక్తిపై అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు విషయంలో వెసులుబాటు కల్పించేందుకు ఎస్సై రూ. 20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. డీఎస్పీ కిషోర్ ఆధ్వర్యంలో స్టేషన్‌పై దాడి చేశారు. ఎస్సై ఆదేశాల మేరకు రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రైటర్ వీరబాబును పట్టుకున్నారు. అనంతరం ఎస్సై, రైటర్ ఇద్దరిపై కేసులు నమోదు చేసి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.