సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే చైనా సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన బీజింగ్ తాజాగా విమానంతో పోటీపడే ఓ సరికొత్త హైస్పీడ్ రైలును (China High Speed Train) పరిచయం చేస్తూ.. మరో ప్రపంచ రికార్డును సృష్టించింది. 2 సెకన్లలోనే 700 kmph వేగాన్ని అందుకునే రైలును ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పరీక్షించింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఈ మ్యాగ్లెవ్ మోడల్ ట్రైన్‌ను రూపొందించినట్లు చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ వెల్లడించింది. దీని బరువు దాదాపు టన్ను వరకు ఉందని తెలిపింది. మెరుపు వేగంతో దూసుకుపోయే ఈ రైలును అనుకున్నవిధంగానే స్టేషన్లలో ఆపినట్లు పేర్కొంది. దీన్ని పరీక్షిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.