అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండి వద్ద.. పడవ పోటీల ట్రయల్ రన్లో పెను ప్రమాదం తప్పింది. కయాకింగ్ బోట్‌పై వెళ్తుండగా పడవ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నీటిలో పడిపోయారు. అయితే ఆయన లైఫ్ జాకెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన స్థానిక మత్స్యకారులు మరో పడవలో వెళ్లి కలెక్టర్ మహేష్ కుమార్‌ను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారుల్లో కాసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, కలెక్టర్ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు యథావిధిగా ట్రయల్ రన్‌ను కొనసాగించారు. లైఫ్ జాకెట్ ఉండటం వల్లే కలెక్టర్ క్షేమంగా బయటపడటంతో, భద్రతా ప్రమాణాలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన నిరూపించింది.