శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గంలో అర్ధరాత్రి చిరుతపులి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక పూజారి సత్యనారాయణ శర్మ ఇంటి ఆవరణలోకి రాత్రి రెండున్నర గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. ఉదయం యజమాని సిసి కెమెరా దృశ్యాలను పరిశీలించగా, చిరుతపులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దాంతో ఆయన ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సమీపంలోనే కొండ ప్రాంతం ఉండటంతో చిరుతపులి జనావాసాల్లోకి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా అదే ఇంట్లో చిరుత సంచరించిన దాఖలాలు ఉండటంతో, భక్తులు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం, అటవీశాఖ సిబ్బంది మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.