శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్ ఖాతాలో పొరపాటున భారీ మొత్తంలో నగదు జమ కావడం సంచలనం సృష్టించింది. చెన్నైలోని అల్వార్పేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ నుండి సాంకేతిక తప్పిదం కారణంగా అటెండర్ మసూద్ ఖాతాకు ఏకంగా రెండు కోట్ల 62 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన మసూద్.. అందులో నుంచి సుమారు 40 లక్షల రూపాయలను తన సన్నిహితుల వివిధ ఖాతాలకు మళ్లించాడు. దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో బ్యాంక్ అధికారులు హుటాహుటిన స్పందించారు. వెంటనే మసూద్ కుటుంబ సభ్యులను సంప్రదించి, ఇతర అకౌంట్‌కు మళ్లించిన 40 లక్షల రూపాయలను తిరిగి కదిరి స్టేట్ బ్యాంక్ బ్రాంచ్‌లో డిపాజిట్ చేయించారు. అనంతరం ఖాతాలో ఉన్న మొత్తం 2.62 కోట్లను తిరిగి చెన్నై శాఖకు బదిలీ చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.