మార్పు వైపు అడుగు
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:01 AM
మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నాం. రానున్న కొన్ని సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. డిగ్రీ, ఇతర ఉన్నతవిద్య, పాలిటెక్నిక్ సబ్జెక్టుల్లో కీలక మార్పులు తెచ్చాం.
ఉన్నత విద్య అవకాశాలను పెంచి, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నారు సాంకేతిక విద్యా శాఖ, కాలేజీ విద్యా కమిషనర్ ఎ. శ్రీదేవసేన. విద్యారంగంలో చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ ఏడాది విద్యా పరిపాలనలో విశిష్ట పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ‘నవ్య’తో అనేక విషయాలను ఆమె పంచుకున్నారు.
‘‘మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నాం. రానున్న కొన్ని సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. డిగ్రీ, ఇతర ఉన్నతవిద్య, పాలిటెక్నిక్ సబ్జెక్టుల్లో కీలక మార్పులు తెచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా... పారిశ్రామిక నిపుణుల్ని సంప్రతించి సిలబ్‌సలో అవసరమైన మార్పులు చేపట్టాం. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులతో సమావేశమై మొత్తం సబ్జెక్టుల అప్‌డేట్, అప్‌గ్రేడ్ చేపట్టాం. ఇప్పుడు ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరిగింది. దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్టుల్లో ఏఐ, మిషన్ లెర్నింగ్, డిజైన్ థింకింగ్ వంటి కీలక అంశాల్ని చేర్చాం. దీంతో విద్యార్థుల పరిజ్ఞానం పెరుగుతుంది. డిగ్రీ అయిన వెంటనే ఉద్యోగం చేయాలనుకునేవారికి అనువైన వాతావరణం, అవగాహన ఏర్పడుతుంది.
బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు గతంలో చాలా సాధారణంగా ఉండేవి. కానీ ఈసారి ఏఈడీపీ ప్రోగ్రాం రూపొందించాం. దీనివలల్ల డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల నుంచి బయటకు వచ్చే విద్యార్థులకు విస్తృతఅవకాశాలు లభిస్తున్నాయి.
95 శాతం అడ్మిషన్లు
పాలిటెక్నిక్‌లో ఈసారి కొత్తగా చేపట్టిన విధానాల గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించడంతో గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో అడ్మిషన్లు 95 శాతానికి చేరాయి. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరిగింది. పదో తరగతిలో ఉన్నప్పుడే విద్యార్థులను స్కూళ్లలో కలిసి, పాలిటెక్నిక్ గురించి వివరించాం. మూడేళ్ల తర్వాత వారికి లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని వివరించి ఇటువైపు ఆకర్షించాం. ప్రభుత్వం పాలిటెక్నిక్‌లను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసింది. టాటా టెక్నాలజీతో కలిసి అందుకు తగినట్టుగా అప్‌గ్రేడ్ చేశాం. రాష్ట్రంలో ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో భాగంగా... దేశంలో ఎక్కడా లేని ఐదు ప్రత్యేక కోర్సులను మొదటిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టాం. టీ-హబ్ తరహాలో ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటు జరిగింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్, ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ-హబ్, జేఎన్టీయూలో జే-హబ్‌లు ఏర్పాటు చేశాం.
విదేశీ యూనివర్సిటీలతో...
తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జర్మనీతో మూడు రకాల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఓయూ, కేయూ, పాలమూరు యూనివర్సిటీలు దీనిలో భాగస్వాములు అవుతాయి. తెలంగాణలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ చదివిన పిల్లలు జర్మనీలో ఒక్క ఏడాది చదివితే మాస్టర్స్ డిగ్రీ వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఇక్కడ చదువుకునే సమయంలోనే జర్మనీ భాష నేర్చుకుంటే ఆ దేశంలో ఉచితంగా చదువుకునేందుకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. జర్మనీలో సుమారు ఏడు లక్షల వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు జర్మనీ భాష నేర్పిస్తున్నాం. బీ1 లెవల్‌లో జర్మనీ నేర్చుకుంటే అక్కడ ఉచిత విద్యను పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో వీలైనంత ఎక్కువమంది విదార్థులకు జర్మనీ భాష నేర్పించి అక్కడికి పంపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోది. అలాగే జర్మనీ యూనివర్సిటీల నుంచి ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నత విద్యలో చేపడుతున్న విధానాలు, మార్పులతో సమీప కాలంలో అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంది.’’