ప్రవాసంలో ఆధ్యాత్మిక పాఠం
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:22 AM
బాల్యంలో కళలు, సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి పావని చిలువేరు (మెట్టు)ను ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణ వైపు నడిపిస్తే... నేర్చుకున్న వాటిని తోటివారికి పంచాలనే తపన ఆమెను బోధకురాలుగా మార్చింది.
బాల్యంలో కళలు, సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి పావని చిలువేరు (మెట్టు)ను ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణ వైపు నడిపిస్తే... నేర్చుకున్న వాటిని తోటివారికి పంచాలనే తపన ఆమెను బోధకురాలుగా మార్చింది. సింగపూర్‌లో స్థిరపడిన పావని స్తోత్రాలు, శ్లోకాల్లాంటి అనేక ఆధ్యాత్మిక అంశాల బోధన కోసం ‘జ్ఞానప్రదాయినీ శ్లోకాభ్యాస వేదిక’ను స్థాపించారు. రోజూ నిరంతరాయంగా ఎనిమిది గంటలకు పైగా ఉచిత ఆన్‌లైన్ తరగతులను నిబద్ధతతో నిర్వహిస్తూ... ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని భక్తి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తున్నారు. కథ, కవితా రచనల్లోనూ రాణిస్తూ పలు పురస్కారాలు అందుకున్న పావని ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.
‘‘తెలుగు భాష పట్ల అభిమానం, సాహిత్యం అంటే ఆసక్తి నాలో ఏర్పడడానికి కారణం మా నాన్నగారైతే... కళల పట్ల అనురక్తి, సృజనాత్మకత మా అమ్మ నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఈ రెండు సంస్కారాలే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ప్రధానమైన పాత్ర పోషించాయి. ఆధ్యాత్మికంగా నా ప్రయాణానికి అవి తొలి మెట్లు అని గర్వంగా చెప్పగలను. మా స్వస్థలం తెలంగాణలోని హనుమకొండ. నా విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. మా నాన్నగారు మెట్టు మురళీధర్ విశ్రాంత తెలుగు లెక్చరర్. ఆయన ప్రముఖ రచయిత కూడా. అమ్మ తారాదేవి గృహిణి. నేను, ఇద్దరు చెల్లెళ్ళు... ముగ్గురం పిల్లలం. చిన్నప్పటి నుంచి చూసిన ప్రతిదాన్నీ నేర్చుకోవాలనే ఉత్సాహం నాలో ఉండేది. ముగ్గులు వేయడం, కుట్లు, అల్లికలు, పెయింటింగ్స్, పాత వస్తువుల రీసైక్లింగ్... ఇలా ఎన్నో చేసేదాన్ని. నేను గీసిన బొమ్మల పక్కన కవితలు రాసేదాన్ని. నాకు వివాహమయ్యే సమయానికి డిగ్రీ చదువుతున్నాను. ఆ తరువాత దూరవిద్య ద్వారా ఎమ్మెస్సీ చేశాను. నా భర్త శ్రీనివాస్ చిలువేరు. ఆయన కూడా వరంగల్‌కి చెందినవారే. మా అత్తమామలు కీర్తిశేషులు చిలువేరు సావిత్రి, చంద్రమౌళి. వివాహం తరువాత... మావారి ఉద్యోగరీత్యా 22 ఏళ్ళ క్రితం సింగపూర్ వచ్చాం. ఇక్కడే స్థిరపడ్డాం.
గురు ముఖంగా...
బాల్యం నుంచి నాలో ఉన్న ఆధ్యాత్మిక భావనలు జ్ఞానాన్వేషణ దిశగా నన్ను నడించాయి. ఈ విషయంలో నాకు దిశానిర్దేశం చేసినవారిగా గురువులు చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మలను ప్రథమంగా స్మరించుకుంటాను. వారి ప్రవచనాలు, రచనలు సనాతన ధర్మం గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆలోచన కలిగించాయి. ప్రతిదీ గురుముఖంగానే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా... మొదట మా గురువుగారు గోపాలశర్మ దగ్గర శాస్త్రాధ్యయనం ప్రారంభించాను. ఆ తరువాత... వివిధ సంస్థల్లో ఎంతోమంది గురువుల దగ్గర శాస్త్రోక్తంగా నేర్చుకున్నాను. ఆ సంస్థలు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు... వాటిలోనే ఉప శిక్షకురాలుగా అనుభవం సంపాదించుకున్నాను. అయిదున్నరేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నాను. దానికోసం ‘జ్ఞానప్రదాయినీ శ్లోకాభ్యాస వేదిక’ను ఏర్పాటు చేశాను.
లోతైన అధ్యయనంతో...
ఇతరులకు బోధించే ప్రతి విషయాన్నీ లోతుగా అధ్యయనం చేస్తాను. శ్లోకాల తాత్పర్యాన్ని అర్థం చేసుకుంటాను. అధ్యయనం నుంచి ఆచరణ వరకూ ప్రతి దశనూ ఎంతో శ్రద్ధగా కొనసాగిస్తున్నాను. సంపూర్ణమైన అవగాహన ఏర్పరుచుకున్న తరువాతే ఇతరులకు బోధిస్తాను. అలాగే... ఉదాహరణ పూర్వకంగా... వారికి సులువుగా అర్థమయ్యేలా వివరిస్తాను. ప్రతి పదాన్నీ విభజన చేసి, సరైన ఉచ్చారణతో నేర్పిస్తూ ఉంటాను. ముఖ్యంగా మహాప్రాణాలు, ఒత్తులు లాంటివి సరిగ్గా పలకకపోతే పదం తాలూకు అర్థం ఏ విధంగా మారుతుందో చెబుతాను. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, సౌందర్యలహరి, శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రం, కనకధారా స్తోత్రం, వేంకటేశ్వర సుప్రభాతం, మణిద్వీపం, రుద్రం, వివిధ సూక్తాలు, తిరుప్పావై, శ్యామలా దండకం, హనుమాన్ చాలీసా, శ్రీరామరక్షా స్తోత్రం, ఆదిత్య హృదయం, నారాయణీయం, భగవద్గీత, వారాహి కవచం, వారాహి స్తోత్రం... ఇలా ఎన్నిటినో బోధిస్తున్నాను.
అంతా ఉచితమే...
సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతిరోజూ ఎనిమిది గంటల సేపు ఆన్‌లైన్ ద్వారా నా బోధన సాగుతుంది. ఆ రోజుల్లో వీలుకాని వారికోసం వారాంతాల్లో కొన్ని తరగతులు నిర్వహిస్తున్నాను. సింగపూర్, భారత్ నుంచి మాత్రమే కాదు... ప్రపంచంలోని పలు దేశాల నుంచి నాలుగు వేలమందికి పైగా నా తరగతులకు హాజరవుతున్నారు. వారిలో పెద్ద వయసున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వారిలో కొందరు కేవలం పదాలు మాత్రమే చదువుకోగలిగినంత నేర్చుకున్నవారూ ఉన్నారు. అయినా వారిలో కనిపించే జిజ్ఞాస, నేర్చుకోవాలనే తపన, శ్రద్ధ, పట్టుదల నాకు సంతోషంతో పాటు స్ఫూర్తిని కూడా కలిగిస్తాయి విద్యకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నవారు నా విద్యార్థులు కావడం అదృష్టంగా భావిస్తున్నాను. వైద్యం, ఇంజినీరింగ్, న్యాయశాస్త్ర విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా నా తరగతుల్లో పాల్గొంటారు. బాధ్యతలతో ఎంతో బిజీగా ఉన్నా... అధ్యయనాన్ని ఎంతోమంది ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గర్భిణుల కోసం... తరగతులను అదనపు తరగతులు నిర్వహిస్తాను. పిల్లల కోసం శని, ఆదివారాల్లో చిన్న చిన్న శ్లోకాలు, హనుమాన్ చాలీసా, శ్రీరామరక్షా స్తోత్రం లాంటివి బోధిస్తాను. ఈ తరగతుల కోసం ఎలాంటి రుసుమూ వసూలు చేయడం లేదు. పూర్తిగా ఉచితంగానే అందిస్తున్నాను.
వారి వల్లే సాధ్యమవుతోంది...
ఒక మహిళ కుటుంబ బాధ్యతలు నిర్వరిస్తూ, బయటకు వచ్చి, తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకోవాలంటే కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం. నా ఈ ప్రయాణంలో మావారు శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉంది. నేను ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించిన తొలి రోజుల్లో... ఈ విధానం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. మావారు సెలవు పెట్టి, ఇంట్లోనే ఉండి... ఎలాంటి అంతరాయం లేకుండా తరగతులు కొనసాగేలా సాయపడ్డారు. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి సాత్విక్ ఐటీ రంగంలో ఉద్యోగి. చిన్నబ్బాయి అభినవ్ ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూ, పార్ట్ టైమ్ బిజినెస్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. నా కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగించడంలో వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. జీవితమంతా శాస్త్రాధ్యయనం చెయ్యాలనేది నా అభిలాష. పదేళ్ళుగా నేను ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాను. ప్రస్తుతం కృష్ణ యజుర్వేదంలోని నారాయణోపనిషత్తును అధ్యయనం చేస్తున్నాను. గురువుల అనుగ్రహం, అమ్మవారి కృప, కుటుంబ సభ్యుల సహకారం, విద్యార్థుల ప్రేమ కారణంగానే ఇదంతా సాధ్యమవుతోంది. ఈ మార్గంలో మరింత వినయంగా, మరింత శ్రద్ధగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.’’
సాహిత్యంలోనూ...
‘‘ఆధ్యాత్మిక అంశాల బోధనతోపాటు కవితలు, కథలు, వివిధ సాహిత్య రచనలు చేస్తున్నాను. పలు పోటీల్లో ఉత్తమ కవయిత్రిగా, ఉత్తమ రచయిత్రిగా బహుమతులు పొందాను. ఈ ఏడాది వంశీ-సీల్వెల్ ఉగాది ప్రవాస భారతీయ సాహితీ పురస్కారాన్ని హైదరాబాద్‌లో అందుకున్నాను. తానా వారి ‘వరల్డ్ తెలుగు కల్చరల్ ఫీస్ట్’లో సింగపూర్ నుంచి వ్యాఖ్యాతగా ప్రత్యేక బహుమతి పొందాను. ఎనిమిదిసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నా పేరు ప్రచురితమైంది. అంతర్జాతీయ వేదికలపై, ప్రత్యేకించి సింగపూర్‌లో జరిగిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాను. వద్దిపర్తి పద్మాకర్ గారి అవధాన కార్యక్రమాల్లో పృచ్ఛకురాలుగా పాల్గొన్నాను.
కృష్ణశర్మ