కళాత్మక కుటీరం సారా నివాసం
ABN , Publish Date - May 17 , 2026 | 04:35 AM
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ అంటేనే ఒక వైవిధ్యం. ఇటీవల ‘పతి పత్ని ఔర్ వో దో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సారా మనస్తత్వమే కాదు..
బాలీవుడ్ నటి సారా అలీఖాన్ అంటేనే ఒక వైవిధ్యం. ఇటీవల ‘పతి పత్ని ఔర్ వో దో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సారా మనస్తత్వమే కాదు.. ఆమె జీవనశైలి కూడా అంతే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లు అనగానే ఖరీదైన హంగులు, కార్పొరేట్ లుక్ గుర్తొస్తాయి. కానీ సారా ముంబై ఫ్లాట్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అది ఒక నిఖార్సయిన నివాసంలా ఎంతో ఆత్మీయంగా కనిపిస్తుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని మేళవించి ఆమె తన ఇంటిని తీర్చిదిద్దుకుంది.
గదుల్లో ఆమె వ్యక్తిత్వం: ఒక ఇల్లు ఎలా ఉండాలి? కేవలం ఖరీదైన వస్తువులు అమరిస్తే సరిపోతుందా?.. ‘లేదు’ అంటుంది సారా. ఇల్లు అనేది అందులో నివసించేవారి వ్యక్తిత్వానికి నిలువుటద్దంలా ఉండాలి. సారా ఇంట్లోకి అడుగుపెడితే ఆమెలోని ఆత్మవిశ్వాసం, ఆహ్లాదకరమైన చాతుర్యం ప్రతి మూలలోనూ ప్రతిఫలిస్తాయి. ఎక్కడా కృత్రిమత్వం లేని, ఎంతో సహజమైన వాతావరణం అక్కడ కనిపిస్తుంది. కళ అనేది స్వీయ వ్యక్తీకరణతోనే మొదలవుతుందని సారా నివాసం నిరూపిస్తోంది.
రంగుల కలయిక: గోడలకు న్యూట్రల్ కలర్స్ వేసి, ఫర్నిచర్‌తో కాంట్రాస్ట్ తీసుకురావడం సారా శైలి. ఇల్లేదో బోసిపోయినట్టు కేవలం వైట్ లేదా బేజ్ రంగులకే పరిమితం కాలేదు. బేజ్ రంగు గోడలకు చక్కని వైన్‌రెడ్ (ద్రాక్షరంగు) డిజైన్ కార్పెట్, గీతల డిజైన్ ఉన్న సోఫాలను జతచేసింది. రంగులు ఇల్లంతా నింపేయాల్సిన పనిలేదు. సరైన చోట, సరైన రంగును అద్ది ఇంటి రూపురేఖలను ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ.
ఇంటీరియర్‌కు లోతైన టెక్స్చర్స్: సారా లివింగ్ రూములోకి వెళ్తే.. వస్తువుల ఎంపికలో ఆమె చూపిన శ్రద్ధ ఆకట్టుకుంటుంది. కింద కూర్చునేలా ఉండే లో సీటింగ్ కాఫీ టేబుల్, ప్రకృతిని ఇంట్లోకి ఆహ్వానించేలా పెద్ద గ్లాస్ విండోస్, చెక్కతో చేసిన గుర్రపు తలల శిల్పాలు, నిలువెత్తు అద్దం, చక్కని పుస్తకాల షెల్ఫ్.. ఇలా ప్రతీది ఒకదానికొకటి నప్పేలా అమర్చుకుంది. ఖరీదైన ఇంటీరియర్ కంటే ఇలాంటి చిన్నచిన్న కళాఖండాలు, చేతివృత్తి నైపుణ్యాలున్న వస్తువులు గదికి ఒక ప్రత్యేకమైన నిండుదనాన్ని తీసుకొచ్చాయి.
జ్ఞాపకాలకు అలంకారం: సారా తన ఇంటిని కేవలం అందమైన వస్తువులతోనే కాదు.. భావోద్వేగాలతోనూ అలంకరించుకుంది. ఫ్యామిలీ ఫొటోలు, జ్ఞాపికలు, పాతకాలపు వస్తువులను ఇంటీరియర్‌లో భాగం చేసింది. షో పీస్‌ల కంటే మన మనసుకు నచ్చిన జ్ఞాపకాలను అమర్చుకున్నప్పుడే ఆ ఇల్లు మరింత అందంగా, ఆత్మీయంగా మారుతుందని సారా నమ్ముతుంది. ఎందుకంటే ప్రతి జ్ఞాపకం వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది కదా!
జామెట్రిక్ డివైడర్: ఆధునిక ఇళ్లలో స్పేస్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. దీనికోసం సారా ఒక అద్భుతమైన ఐడియా ఫాలో అయింది. గదుల మధ్య విభజన కోసం గోడలు కట్టకుండా జామెట్రిక్ ఆకృతులతో కూడిన ఒక అందమైన చెక్క డివైడర్‌ను ఉపయోగించింది. ఇది ఇంటికి విభిన్నమైన లుక్‌ను ఇవ్వడమే కాకుండా, కంటెంట్ క్రియేటర్లకు ఒక చక్కని బ్యాక్‌డ్రా్‌పలా కూడా ఉపయోగపడుతుంది.
చివరిగా సారా అలీఖాన్ ఇల్లు మనకు నేర్పే పాఠం ఒక్కటే.. ఇల్లు అందంగా, విలాసవంతంగా కనిపించడానికి కచ్చితంగా ‘మినిమలిస్టిక్ స్టైల్’ అవసరం లేదు. అలాగని లక్షలు కుమ్మరించాల్సిన పనీలేదు. రంగులు, జ్ఞాపకాలు, కళాత్మక వస్తువులను సరైన పద్ధతిలో ఎలా జోడించామనేదే ముఖ్యం. మనసుకు నచ్చినట్టుగా ఇంటిని తీర్చిదిద్దుకుంటే అది నిరంతరం మనకు కొత్త ఆలోచనలను ఇచ్చే ఒక నందనవనం అవుతుంది.