Share News

రాజ్యసభలో రెయిన్‌బో విప్లవం

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:25 AM

మేనక పుట్టింది హైదరాబాద్‌లోనే! ఆమె తండ్రి మోహన్‌ గురుస్వామి ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ సిద్ధాంత కర్త. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయికి సలహాదారుగా వ్యవహరించారు.

రాజ్యసభలో రెయిన్‌బో విప్లవం

పశ్చిమ బెంగాల్‌లో అధికార పార్టీ అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌... త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మేనక గురుస్వామి ఉండడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమె వైపు మళ్లింది. సామాజిక మాధ్యమాల్లో ఆమె గొప్పదనం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గనక ఎగువ సభకు ఎన్నికయితే దేశంలోనే మొదటి క్వీర్‌ పార్లమెంటేరియన్‌గా రికార్డు సృష్టించినవారవుతారు.

మేనక పుట్టింది హైదరాబాద్‌లోనే! ఆమె తండ్రి మోహన్‌ గురుస్వామి ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ సిద్ధాంత కర్త. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయికి సలహాదారుగా వ్యవహరించారు. తల్లి మీరా గురుస్వామి ఓ అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలో కాపీరైటర్‌గా పనిచేసేవారు. మేనక తాత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తరువాత ఆ వారసత్వాన్ని తండ్రి కూడా కొనసాగించడంతో మేనకకు చిన్నప్పటి నుంచే న్యాయవాద వృత్తిమీద ఇష్టం కలిగింది. తండ్రి ఉన్నతమైన ఆశయాలు వింటూ అతను చేసే ప్రజాసేవ చూస్తూ పెరిగారు మేనక. బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. తరువాత రోడ్స్‌ స్కాలర్‌షిప్‌ సాధించి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ సివిల్‌ లా (బీసీఎల్‌) పట్టా పొందారు. హార్వర్డ్‌ లా స్కూల్లో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేసి అంతర్జాతీయ చట్టాల్లో అవగాహన సాధించారు. భారతదేశ మొదటి మహిళ న్యాయవాది అయిన కార్నెలియా సోరాబ్జి నుంచి ప్రేరణ పొంది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ వాదనలపై దృష్టి మళ్లించారు.

Untitled-8 copy.jpg


న్యాయవాదిగా..

లా డిగ్రీ పూర్తిచేసిన తరువాత మేనక అప్పటి అటార్నీ జనరల్‌ అశోక్‌ దేశాయ్‌ కార్యాలయంలో లాయర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. ప్రాథమిక హక్కులు, పరిపాలనా చట్టాలకు సంబంధించి క్లిష్టమైన కేసులను వాదించడంలో ప్రాథమిక అనుభవం సాధించారు. 2015లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డీఫిల్‌ పట్టా పొందిన తరువాత న్యూఢిల్లీలో సొంత ప్రాక్టీస్‌ ప్రారంభించారు. రాజ్యాంగం, క్రిమినల్‌, వాణిజ్య చట్టాల్లో అవగాహనను పెంచుకుని పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించి కఠినమైన వాదనలను వినిపించేవారు. ఆమె నైపుణ్యాలను, మానవ హక్కుల సాధన కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన సుప్రీంకోర్టు 2019లో ఆమెను సీనియర్‌ న్యాయవాదిగా నియమించింది. సెక్షన్‌ 377, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ లంచం, సల్వా జుడుం, బ్యూరోక్రాటిక్‌ సంస్కరణలు, విద్యా హక్కులు లాంటి ఎన్నో కేసులు వాదించి గెలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు మేనక.


ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం...

ఎల్‌జీబీటీక్యూ అనేది లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌, క్వీర్‌ లాంటి వర్గాలను తెలియజేసే పదం. ప్రకృతి నియమానికి విరుద్దంగా శారీరక సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 377ను సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో పిటిషనర్లకు మేనక న్యాయవాదిగా పనిచేశారు. వివాహ చట్టాలకు సవరణలు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినవారికి ప్రాతినిథ్యం వహించారు. వివాహం నుంచి స్వలింగ జంటలను మినహాయించడం రాజ్యాంగ విరుద్దమంటూ వాదించి విజయం సాధించారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్చ- గౌరవాల గుర్తింపు కోసం ఆమె విశేషంగా శ్రమించారు. వృత్తిపరంగా తనకు సహాయ సహకారాలు అందించిన తోటి న్యాయవాది అరుంధతి కట్జుతో స్వలింగ సంబంధాన్ని కొనసాగించారు మేనక. కుటుంబం, సమాజం వ్యతిరేకించినా కూడా తమ బంధాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి ఆమె భయపడలేదు.

బోధనలో కూడా...

మేనక.. కొలంబియా లా స్కూల్‌లో బీ.ఆర్‌ అంబేద్కర్‌ రీసెర్చ్‌ స్కాలర్‌గా, లెక్చరర్‌గా పనిచేశారు. యేల్‌ లా స్కూల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా, యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటో, హార్వర్డ్‌ లా స్కూల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫ్యాకల్టీగా సేవలు అందించారు.


మేనక గెలుస్తారా...

దేశంలోని పది రాష్ట్రాలకు సంబంధించి 37 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని అయిదు స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో నాలుగు స్థానాలను టీఎంసీ గెలుచుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఏ పార్టీ అయినా అదనపు అభ్యర్థిని నిలబెట్టకపోతే మేనక గురుస్వామి గెలిచే ఛాన్స్‌ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అందుకున్న గౌరవాలెన్నో..!

  • ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలోని రోడ్స్‌ హౌస్‌లో

  • మేనక తన పొటోని ప్రదర్శించి ఆ గౌరవం అందుకున్న మొదటి భారతీయురాలిగా రెండో మహిళగా పేరు పొందారు.

  • హార్వర్డ్‌ లా స్కూల్‌... అంతర్జాతీయ మహిళా దినోత్సవం(2019)నాడు నిర్వహించిన మహిళా స్ఫూర్తిదాయక మార్పు అనే పోరె్ట్రయిట్‌ ప్రదర్శనలో మేనకను ప్రత్యేకంగా గుర్తించింది.

  • ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వందమంది వ్యక్తులతో రూపొందించిన టైమ్‌ 100 జాబితాలో కూడా ఆమె చోటు సంపాదించుకున్నారు.

  • యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా నుంచి థామ్సన్‌ జెఫర్సన్‌ ఫౌండేషన్‌ మెడల్‌ను అందుకున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 05:32 AM