రోగనిరోధక శక్తికి ‘గోల్డెన్ బ్రోత్’
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:25 AM
చలికాలం రాగానే జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టడానికి విదేశాల్లో బాగా ట్రెండ్ అవుతున్న..
చలికాలం రాగానే జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టడానికి విదేశాల్లో బాగా ట్రెండ్ అవుతున్న ‘వెజిటబుల్ గోల్డెన్ బ్రోత్’ (పసుపు-కూరగాయల కషాయం) మన వంటింటి చిట్కాలతో అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
ఏమిటీ గోల్డెన్ బ్రోత్?: కూరగాయల తొక్కలు, సుగంధ ద్రవ్యాలతో నెమ్మదిగా మరిగించి తయారుచేసే పోషకాల సూప్ ఇది.
తయారీ విధానం: క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ ముక్కలు లేదా వాటి శుభ్రమైన తొక్కలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి పసుపు ముక్క, మిరియాలను నీటిలో వేసి సన్నని మంటపై 30 నిమిషాలు మరిగించాలి.
వాపు నివారిణి: ఇందులోని పసుపు, మిరియాల కలయిక శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించి, చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
పేగుల ఆరోగ్యం: చలిలో మందగించే జీర్ణక్రియను ఇది వేగవంతం చేస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలను దరిచేరనివ్వదు.
చర్మానికి మెరుపు: ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను పునరుత్తేజితం చేసి, చలిలోనూ చర్మం పొడిబారకుండా కాపాడతాయి.
టీ, కాఫీలకు ప్రత్యామ్నాయం: సాయంత్రం వేళ టీ, కాఫీలకు బదులుగా గోరువెచ్చని గోల్డెన్ బ్రోత్ తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం, రోగనిరోధక శక్తి లభిస్తాయి.
నిల్వ: ఎక్కువ మొత్తంలో బ్రోత్ తయారుచేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పోసి ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. అయితే, మూడునాలుగు రోజుల్లో వాడేయాలి. మళ్లీ తాగేటప్పుడు పోషకాలు నిలిచేలా చిన్న మంటపై గోరువెచ్చగా వేడిచేయండి.
రుచి కోసం: సాధారణ రుచి కాకుండా కొత్తగా అనిపించాలంటే చివరిగా కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా మిసో పేస్ట్ కలపండి. పులుపు, సుగంధ ద్రవ్యాల కలయికతో కషాయం మరింత రుచిగా ఉంటుంది.