Share News

ధ్యాని... జ్ఞాని

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:04 AM

ఒక వైద్య విద్యార్థి ఏళ్ళ తరబడి పుస్తకాలు చదువుతాడు. ఒక వైద్యుడు తన వృత్తి జీవితాన్ని రోగుల నుంచి నేర్చుకుంటూ గడుపుతాడు.

ధ్యాని... జ్ఞాని

ఒక వైద్య విద్యార్థి ఏళ్ళ తరబడి పుస్తకాలు చదువుతాడు. ఒక వైద్యుడు తన వృత్తి జీవితాన్ని రోగుల నుంచి నేర్చుకుంటూ గడుపుతాడు. వైద్యపరంగా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు వైద్యులకు ఒకే రకమైన అర్హతలు, ఒకే రకమైన వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ... వారి నిర్ణయాల్లో, ప్రతిస్పందనల్లో గణనీయమైన వ్యత్యాసం ఉండవచ్చు. వారిలో ఒకరు వ్యాధిని మాత్రమే చూస్తే, మరొకరు వ్యాధి వెనుక ఉన్న వ్యక్తిని చూడవచ్చు. ఈ వ్యత్యాసానికి కారణం... విజ్ఞానం కలిగి ఉండడం కాదు, వివేకం కలిగి ఉండడం.

తెలుసుకోవడం వేరు, అనుభవం వేరు

ఆ వివేకం ఎక్కడినుంచి వస్తుంది? అనే ఆలోచన ఒక కార్డియాలజిస్టుగా నాలో తరచూ కలుగుతూ ఉంటుంది. ఒక వైద్యుడు వాణిజ్య ప్రయోజనాలకు బదులు కరుణను, చిరాకుకు బదులు సహనాన్ని, వ్యక్తిగత లాభానికి బదులు నైతిక బాధ్యతను ఎందుకు ఎంచుకుంటారు? మనం ఏం చేయాలో పుస్తకాలు మనకు బోధించగలవు. కానీ పాఠ్య పుస్తకంలో స్పష్టమైన సమాధానం లేనప్పుడు... ఎలా స్పందించాలో అనుభవం మనకు నేర్పుతుంది. జీవితానికి సంబంధించిన అంతిమ వాస్తవాలను ఎదుర్కొనే సందర్భంలో... వ్యాకరణానికి, పాండిత్య పరిజ్ఞానానికి ఉన్న విలువ పరిమితమేనని ‘భజగోవిందం’లో ఆదిశంకరులు మనకు గుర్తు చేస్తారు. ఈ సందేశం అభ్యసనానికి వ్యతిరేకం కాదు. జ్ఞానం... దాన్ని పొందిన వ్యక్తిలో మార్పు తెచ్చిందా? లేదా? అనేది పరిశీలించాల్సిందిగా ఇది మనకు సూచిస్తుంది. మరి బాహ్యమైన విజయాలకు ప్రాధాన్యం లేనప్పుడు... ఏ జ్ఞానం అర్థవంతంగా మనలో నిలిచిపోతుంది? జనక మహారాజు, అష్టావక్ర మహర్షి మధ్య జరిగిన ఒక సంభాషణ దీనికి లోతైన ఉదాహరణను అందిస్తుంది. జనకుడు నిత్యం ఎందరో పండితులతో తాత్త్విక చర్చలు సాగిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ, జ్ఞానం, మోక్షం గురించి ఒక ప్రాథమిక ప్రశ్న ఎదురైనప్పుడు అతను అష్టావక్రుణ్ణి సంప్రతించాడు. జనకుడిలాంటి పండితుడు మరొకరి నుంచి జ్ఞానాన్ని ఎందుకు కోరుకుంటాడు? బహుశా సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని అనుభవించడం ఒకటి కాదని జనకుడు గుర్తించడం వల్ల కావచ్చు.


అపార్థాల పొరలు

ఈ వ్యత్యాసాన్ని ఉపనిషత్‌ సంప్రదాయం పదేపదే సూచిస్తుంది. అవిద్య... అంటే అజ్ఞానం, దేన్నైనా తప్పుగా అర్థం చేసుకోవడం... అనేక అపార్థాల పొరలను సృష్టిస్తుంది. ఆ పొరల్లోంచే మనం మనల్ని, ప్రపంచాన్ని గమనిస్తాం. కోపం హానికరం అని తెలిసినా మనం కోప్పడవచ్చు. కరుణ గొప్పతనాన్ని గురించి అర్థం చేసుకున్నా కఠినంగా ప్రవర్తించవచ్చు. వైరాగ్యం గురించి మాట్లాడుతున్నా... విషయాల పట్ల గాఢమైన అనుబంధంతో ఉండవచ్చు. ఇక్కడే ధ్యానం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ధ్యానం అనుభవ జ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తుంది. నిరంతరం మన దృష్టిని అంతరాత్మవైపు మళ్ళించినప్పుడు... మన ఆలోచనలను, భావోద్వేగాలను, ప్రతిచర్యలను ఏవి ప్రభావితం చేస్తున్నాయో గమనించడం మొదలుపెడతాం. దీని ఉద్దేశం జీవితం నుంచి వైదొలగడం కాదు. దానిలో జీవిస్తూనే మరింత స్పష్టతను పెంచుకోవడం. ధ్యానం, ప్రార్థన లాంటి అభ్యాసాలు మన అంతర్గత ప్రతిస్పందనలను ప్రభావితం చేసే ప్రతికూలతలను తగ్గిస్తాయి. దీనివల్ల సాధకుడు క్రమంగా ప్రతిస్పందన నుంచి పరిశీలనకు, గందరగోళం నుంచి స్పష్టతకు, ఆవేశం నుంచి అవగాహనతో కూడిన స్పందనకు మారడం ప్రారంభిస్తాడు.

జ్ఞానానికి కొలమానం

ఆధునిక ప్రపంచం అపూర్వమైన వేగంతో విజ్ఞానాన్ని పోగుచేసుకుంటోంది. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, ఆధునిక వైద్య సాంకేతికత మానవాళి తెలుసుకోగలిగే, సాధించగలిగే అంశాల పరిధులను విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ... ‘మనకు తెలిసిన దానితో మనం ఏం చేయాలి?’ అనే మానవుల మౌలిక ప్రశ్న మాత్రం మారలేదు. నిజమైన విద్య ఉద్దేశం కేవలం విజ్ఞానం పరిమాణాన్ని పెంచడం కాదు. దాన్ని నేర్చుకున్న వ్యక్తి గుణాన్ని ఉన్నతీకరించడం. కాబట్టి జ్ఞాని నుంచి ధ్యానిగా మారడం అంటే... మేధోపరమైన అవగాహన నుంచి అంతర్గత అనుభవం వైపు సాగించే ప్రయాణం. జ్ఞానానికి అంతిమమైన కొలమానం మనం అర్థం చేసుకున్న దాని ప్రకారం ఎంత వివేకంగా జీవిస్తున్నామనేదే. జ్ఞానం అంతర్గత అనుభవంలో స్థిరపడి, ఆ అంతర్గత అనుభవం కరుణ ద్వారా వ్యక్తమయితే... వైద్యం ఒక వృత్తిని మించి ఉన్నతమైనదిగా మారుతుంది.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌

ట్రైనర్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌, 9440087532

Updated Date - Oct 23 , 2026 | 06:08 AM