గ్లామర్ వెనుక దిశ
ABN , Publish Date - Jun 14 , 2026 | 02:58 AM
బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా.. మోడలింగ్‌పై నమ్మకంతో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటానీ. గ్లామర్ పాత్రలకే ...
బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా.. మోడలింగ్‌పై నమ్మకంతో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటానీ. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మార్షల్ ఆర్ట్స్.. యాక్షన్ స్టంట్స్‌లోనూ అదరగొడుతూ.. దర్శకురాలిగా కొత్త ప్రయాణాలు చేస్తూ దూసుకుపోతోంది. జూన్ 13న పుట్టిన రోజును జరుపుకొన్న దిశ.. వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన దిశా పటానీ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంపై మక్కువ పెంచుకుంది. మిస్ ఇండియా పోటీల్లో రన్నర్‌పగా నిలిచిన తర్వాత ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఒక ప్రముఖ డెయిరీ బ్రాండ్ యాడ్‌లో ఆమె అమాయకత్వంతో కూడిన నవ్వు దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది. ఆ గుర్తింపుతోనే ఆమెకు సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. సినీ పరిశ్రమ నేపథ్యం లేని కుటుంబం నుంచి రావడంతో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన ‘లోఫర్’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ మూవీలో ఆమె వరుణ్‌తేజ్ సరసన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆమె నటించిన మొదటి చిత్రం ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’. ఈ సినిమాలో ధోనీ తొలి ప్రేయసి ప్రియాంక ఝా పాత్రలో నటించింది. ఇందులో ఆమె స్ర్కీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ, తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్రవేసింది. ఆ సినిమా విజయం ఆమెకు బాలీవుడ్‌లో మంచి పునాది వేసింది. అలాగే, ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 ఎడి’లో ‘రోక్సీ’ అనే కీలక పాత్రలో కనిపించింది. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’తో దిశ కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.
యాక్షన్ క్వీన్‌గా...
బాలీవుడ్‌లో చాలామంది కథానాయికలు కెరీర్ ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తారు. దిశా పటానీ కూడా ‘బాఘి 2’, ‘మలంగ్’ వంటి సినిమాల్లో గ్లామర్‌సగా కనిపించినప్పటికీ, ఆ చిత్రాల్లోని యాక్షన్ సీక్వెన్స్ ద్వారా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ఆమెకు చిన్నప్పటి నుంచే ప్రవేశం ఉంది. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, శారీరక శ్రమతో కూడిన పాత్రలు చేయడానికి ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సినిమాల్లో డూప్ సాయం లేకుండా క్లిష్టమైన ఫ్లిప్స్, కిక్స్ స్వయంగా చేయడం ఆమె ప్రత్యేకత. కిక్‌బాక్సింగ్, క్రమం తప్పకుండా ఆయుధాల శిక్షణ తీసుకుంటుంది. టైగర్ ష్రాఫ్ వంటి యాక్షన్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా యాక్షన్ సీన్లలో ఆమె ఎక్కడా వెనకబడలేదు. ఇందుకోసం ఆమె ప్రతి రోజు జిమ్‌లో గంటల తరబడి శ్రమిస్తుంది. బాలీవుడ్‌లో యాక్షన్ స్టంట్స్ స్వయంగా చేయగల అతికొద్ది మంది హీరోయిన్లలో దిశ ఒకరు.
ట్రోలింగ్‌పై స్పష్టత
దిశా పటానీకి సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫిట్‌నెస్ వీడియోలు, ఫ్యాషన్ ఫొటోషూట్‌లు నిమిషాల్లో వైరల్ అవుతుంటాయి. యువతలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా అనేక అంతర్జాతీయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. అయితే, ఈ క్రేజ్‌తోపాటు ఆమెపై తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్, బాడీషేమింగ్ కామెంట్లు కూడా వస్తుంటాయి. ఆమె వేసుకునే దుస్తులపై, చేసే ఫొటో షూట్లపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడింది. ‘‘ఒకరిని దూరం నుంచి చూసి జడ్జ్ చేయడం చాలా సులభం. గతంలో నేను ఇతరుల అంచనాలకు తగ్గట్టు ఉండాలని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ తాపత్రయాన్ని వదిలేశాను. నా గురించి ప్రజలు ఏమనుకున్నా పర్లేదు. నా అంతరాత్మకు నచ్చినట్టు, నూటికి నూరుశాతం నిజాయతీగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తాను’’ అని చెప్పుకొచ్చింది. నెగెటివిటీని సానుకూలంగా ఎదుర్కోవడంలో ఆమె చూపించే పరిణతి, మానసిక ధైర్యం నేటి యువతకు స్ఫూర్తినిస్తోంది.
కెమెరా వెనుక సరికొత్త ప్రయత్నం
దిశా పటానీ కేవలం కెమెరా ముందు నటించడానికే పరిమితం కాలేదు. కథా పరిజ్ఞానం, సాంకేతికతపై కూడా ఆమెకు పట్టుంది. మూడేళ్ల క్రితం ఆమె ‘క్యుం కరూ ఫికర్’ అనే మ్యూజిక్ వీడియోను స్వయంగా డైరెక్ట్ చేసింది. ఒకవైపు స్టార్ హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే మెగాఫోన్ పట్టి ఒక పాటను విజువలైజ్ చేయడం సాధారణ విషయం కాదు. సంగీతంపై, విజువల్స్ మేకింగ్‌పై ఉన్న అవగాహనతో ఆమె ఈ వీడియోను అద్భుతంగా రూపొందించింది. కేవలం గ్లామర్ బొమ్మగా కాకుండా కెమెరా వెనుక ఉండి కథను, ఆర్టిస్టులను ఎలా నడిపించవచ్చో ఈ ప్రయత్నంతో ఆమె నిరూపించుకుంది. సినిమా టెక్నాలజీపై, దర్శకత్వంపై తనకు ఉన్న పట్టును ఈ వీడియో ద్వారా నిరూపించుకుంది. భవిష్యత్తులో పూర్తిస్థాయి చిత్రానికి దర్శకత్వం వహించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు.
సెకండ్ ఇన్నింగ్స్... టర్నింగ్ పాయింట్
దిశా పటానీ సినిమాలు గతంలో కొన్ని బాక్సాఫీసు వద్ద అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో ఆమె కెరీర్ కాస్త నెమ్మదించింది. అయితే ఈ జూన్ నెల ఆమెకు అత్యంత కీలకంగా మారనుంది. 13న 35వ పుట్టిన రోజు జరుపుకొంది. 26న ఆమె నటించిన భారీ మల్టీస్టారర్ కామెడీ చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ థియేటర్లలోకి రాబోతోంది. భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. సినిమాలో రీమిక్స్ చేసిన కత్రినా కైఫ్ ఐకానిక్ సాంగ్ ‘ఊంచా లంబా కద్’లో తను డ్యాన్స్ చేయడం పెద్ద అచీవ్‌మెంట్ అని చెప్పుకొచ్చింది. అక్షయ్ కుమార్‌ను ప్రత్యేకంగా అడిగి మరీ ఆ పాటను సినిమాలో పెట్టించుకున్నట్టు చెప్పింది. ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటు ఇమ్రాన్ హష్మీ సరసన నటిస్తున్న ‘ఆవారాపన్ 2’ టాకీపార్ట్ షూటింగ్ కూడా జూన్ మొదటి వారంలో విజయవంతంగా పూర్తయింది. ఈ రెండు సినిమాలు మళ్లీ ఆమెను సక్సెస్ ట్రాక్‌పైకి తెస్తాయని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. గ్లామర్ ప్రయాణంతో మొదలై, యాక్షన్ స్టార్‌గా ఎదిగి, ఇప్పుడు దర్శకురాలిగా, విభిన్న నటిగా దిశా పటానీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. సినీ పరిశ్రమలో వచ్చే ఆరోపణలను, సోషల్ మీడియా ట్రోల్స్‌ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే ఆమె వ్యక్తిత్వం చాలా రోజులపాటు ఆమెను రేసులో నిలబెడుతుంది.