Share News

అమ్మ ప్రేమకు బందీ

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:11 AM

భగవంతుడు భక్త పరాధీనుడు. మహా యోగులకు కూడా అంతుచిక్కని పరంధాముడు. అటువంటి మహానుభావుడు తల్లి ప్రేమకు వశుడైపోయాడు. అల్లరి కృష్ణుణ్ణి అదుపు చేయడానికి ఆ తల్లి ఆరాటపడుతోంది.

అమ్మ ప్రేమకు బందీ

భగవంతుడు భక్త పరాధీనుడు. మహా యోగులకు కూడా అంతుచిక్కని పరంధాముడు. అటువంటి మహానుభావుడు తల్లి ప్రేమకు వశుడైపోయాడు. అల్లరి కృష్ణుణ్ణి అదుపు చేయడానికి ఆ తల్లి ఆరాటపడుతోంది. తన చిన్ని కృష్ణుడు సచ్చిదానందమూర్తి అని తెలియని అమాయకురాలైన యశోద... కృష్ణయ్యను తాడుతో రోలుకు కట్టెయ్యాలనుకుంది. పొడుగాటి కవ్వపు తాడు తెచ్చింది. కృష్ణయ్య నడుముకు చుట్టింది . అది అతని నడుముకు సరిపోలేదు. వెంటనే మరో తాడు తెచ్చి, మొదటి తాడుకు ముడి వేసింది. అయినా అది కూడా సరిపోలేదు. ఇంట్లో ఉన్న తాళ్ళన్నిటినీ తెచ్చి, ఒకదానితో మరొకటి జత చేసి, ఆ పసివాడి నడుముకు చుట్టబోయింది. అప్పుడూ సరిపోలేదు. యశోద ఆశ్చర్యపోయింది. ఎలాగైనా కృష్ణయ్యను బంధించి తీరాలనుకుంది. కానీ సాధ్యం కాలేదు. నిజానికి ముల్లోకాలనూ దాచుకున్న ఆ బొజ్జను కట్టి ఉంచడం ఎవరికైనా ఎలా సాధ్యం?


యక్షుల శాప విమోచనం

తనను బంధించడానికి తల్లి పడుతున్న పాట్లన్నీ కృష్ణుడు గమనించాడు. జాలి పడ్డాడు. తల్లిని ఇక ఏమాత్రం కష్టపెట్టకూడదనుకున్నాడు. తనకు తానే స్వచ్ఛందంగా కట్టుబడ్డాడు. కృష్ణయ్యను యశోద ఒక పెద్ద రోలుకు కట్టేసింది. ‘ఇంకెక్కడికి పోతాడులే!’ అనుకుంటూ ఇంటి పనులు చేసుకోవడానికి లోపలికి వెళ్ళింది. అది అదనుగా తీసుకొని... తన బొజ్జకు కట్టిన రోలును ఈడ్చుకుంటూ కృష్ణుడు దూరంగా ఉన్న రెండు మద్ది చెట్ల మధ్యకు వెళ్ళాడు. అంతే! మద్ది చెట్లు రెండూ పిడుగుపాటు లాంటి శబ్దం చేస్తూ నేల కూలాయి. వాటి మధ్య నుంచి అత్యంత తేజస్సంపన్నులైన ఇద్దరు సిద్ధ పురుషులు బయటకు వచ్చి, శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. ‘‘స్వామీ! మేము నీ అనుచరులం. నీకు తెలియనిదేముంది? మేము యక్షులకు రాజైన కుబేరపుత్రులం. అన్ని వేళలా సురాపానం చేస్తూ స్త్రీలోలురమై ఉండేవాళ్ళం. ఒకసారి మేము ఉన్న చోటికి నారద మహర్షి వచ్చారు. మేము ఆయనను లక్ష్యపెట్టలేదు. ఆయన ఆగ్రహించి ‘‘మీరు గర్విష్టులై, మదాంధులై, కన్నూ మిన్నూ కానకుండా ఉన్నారు కాబట్టి... మద్ది చెట్లుగా మారి భూలోకంలో పడి ఉండండి’’ అని శపించారు. మేము మహర్షి పాదాల మీద పడి శాపవిమోచనం కోరాం. మహర్షి మా పశ్చాత్తాపాన్ని గ్రహించి... ‘‘నూరేళ్ళు మీరు మద్ది చెట్ల రూపంలో ఉంటారు. ఆ తరువాత కృష్ణదేవుని స్పర్శతో శాపవిముక్తులు అవుతారు’’ అని చెప్పారు. ఇప్పుడు నీ దయవల్ల మాకు శాప విమోచనం కలిగింది. మమ్మల్ని అనుగ్రహించు’’ అని వేడుకున్నారు. ‘‘మీరు ఇక సుకృతులై చరించండి’’ అని కృష్ణయ్య ఆశీర్వదించాడు. వాళ్ళు ఆయనకు పదేపదే నమస్కరించి సెలవు తీసుకున్నారు.


అంతా కృష్ణ మాయ

మద్ది చెట్లు విరిగిన చప్పుడు విని... నంద యశోదలు భయంతో పరుగు పరుగున బయటకు వచ్చారు. గోకులం అంతా అక్కడకు చేరుకుంది. చిన్ని కృష్ణుడు కూలిన చెట్ల మధ్య చిరునవ్వులు చిందిస్తూ ఆడుకుంటున్నాడు. రోలు, కృష్ణయ్యకు కట్టిన తాడు అలాగే ఉన్నాయి. నందుడు వెళ్ళి కృష్ణుడి నడుముకు కట్టిన తాడును ఊడదీశాడు. వెంటనే కృష్ణయ్య అక్కడ ఏమీ జరగనట్టు ఆడుతూ, పాడుతూ స్నేహితులతో కలిసిపోయాడు. అంత పెద్ద చెట్లు ఉన్నట్టుండి ఎలా కూలిపడ్డాయో, కృష్ణయ్య సురక్షితంగా ఎలా బయటపడ్డాడో అర్థం కాని నంద యశోదలు... తాము నమ్మిన దేవుళ్ళందరికీ మనసులోనే ప్రణమిల్లారు.

- ప్రయాగ రామకృష్ణ

Updated Date - Oct 23 , 2026 | 05:14 AM