Share News

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్

ABN , Publish Date - Mar 02 , 2026 | 06:52 PM

కువైత్ గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున జరిపిన దాడిలో అమెరికాకు చెందిన మూడు ఫైటర్ జెట్స్ కూలిపోయాయని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

పొరపాటున అమెరికా ఫైటర్ జెట్స్‌ను కూల్చిన కువైత్: పెంటగాన్
Kuwait Patriot missile incident

ఇంటర్నెట్ డెస్క్: కువైత్ గగనతల రక్షణ వ్యవస్థ పొరపాటున చేసిన దాడిలో అమెరికన్ ఫైటర్ జెట్స్ కూలిపోయాయని అగ్రరాజ్య రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మూడు ఎఫ్-15 జెట్స్ కూలిపోయాయని పేర్కొంది. అయితే, విమానాల్లోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొంది. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వెల్లడించింది.

కువైత్‌లో యుద్ధ విమానాలు మంటల్లో చిక్కుకుని కూలిపోయిన ఘటన వైరల్‌గా మారిన నేపథ్యంలో పెంటాగాన్ ఈ ప్రకటన విడుదల చేసింది. నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్న ఒక వీడియోలో విమానం నేలవైపు దూసుకొస్తున్న సమయంలో పైలట్ విమానం నుంచి బయటపడ్డట్టు కనిపించింది. ఇది పొరపాటున జరిగిన ఘటన అని యూఎస్ సెంట్రల్ కమాండ్ కూడా అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది.


అమెరికా స్వయంగా రూపొందించిన ఎమ్ఐఎమ్-104 పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారా కువైత్ పొరపాటున ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే, అమెరికా మిలిటరీ ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అత్యాధునిక రాడార్ వ్యవస్థ కలిగిన పేట్రియట్ రక్షణ వ్యవస్థ శత్రు దేశ లక్ష్యాలు, మిత్రదేశ విహంగాలను సులువుగా గుర్తించగలిగినా గతంలో కొన్ని సార్లు ఇలాంటి పొరపాట్లు జరిగాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. యుద్ధ సమయంలో ఇలా జరగడం కాస్త ఆందోళనకరమేనని అంటున్నారు.

మరోవైపు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ సోమవారం మరిన్ని దాడులకు పూనుకుంది. అంతేకాకుండా, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లనూ టార్గెట్ చేసింది. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని కూడా శ్వేత సౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఆయిల్ ట్యాంకర్‌పై దాడి.. భారతీయుడి మృతి

ఇరాన్ తన వ్యూహాన్ని మార్చిందా?


Updated Date - Mar 02 , 2026 | 11:37 PM