రెవెన్యూపై అసంతృప్తి
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:09 AM
రెవెన్యూ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది..చిన్నపనికి కూడా పదేపదే తిరగాల్సి వస్తోందంటున్నారు. రీసర్వే పనులతో రెవెన్యూ సిబ్బంది, అధికా రులు తలమునకలై ఉంటున్నారు. గత ప్రభుత్వం రీసర్వే తప్పిదాలు వెంటాడు తున్నాయి.. సిఫారసులు ఉంటే గానీ పనులు అవడం లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.
సంతృప్తస్థాయిలో అట్టడుగున..
రీసర్వే కొంప ముంచుతోందా ?
భూమిలో కోత.. హద్దుల తగాదాలు..జాయింట్ ఎల్‌పీ నంబర్లు
వెంటాడుతున్న గత సర్వే సమస్యలు
తలలు పట్టుకుంటున్న అధికారులు
రెవెన్యూ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది..చిన్నపనికి కూడా పదేపదే తిరగాల్సి వస్తోందంటున్నారు. రీసర్వే పనులతో రెవెన్యూ సిబ్బంది, అధికా రులు తలమునకలై ఉంటున్నారు. గత ప్రభుత్వం రీసర్వే తప్పిదాలు వెంటాడు తున్నాయి.. సిఫారసులు ఉంటే గానీ పనులు అవడం లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలపై జనంలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో జిల్లా రెవెన్యూ శాఖ వెనుకపడుతూనే ఉంది. రాష్ట్ర స్థాయిలో సంతృప్తి స్థాయి కంటే జిల్లా దాదాపు 20 శాతం తక్కువగా నమోదవుతోంది. అట్టడుగున్న ఉన్న మూడు జిల్లాల్లో ఒకటిగా పశ్చిమ గోదావరి నిలుస్తోంది. సిద్ధాంతంలో సోమవారం ముఖ్య మంత్రి నిర్వహించిన మీ భూమి–మీహక్కు సమావేశంలోనూ రెవెన్యూ శాఖ విషయాన్ని ప్రస్తావించారు. అట్టడుగున్న ఉన్నదంటూ అధికారులకు మొట్టికాయలు పెట్టారు. తీరు మారాలంటూ దిశానిర్దేశం చేశారు. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న 47 సేవల్లో జిల్లా సుమారు 30 విభాగాల్లో అగ్రస్థానంలో ఉంది. నాలుగు విభాగాల్లో అట్టడుగున ఉంది. రెవెన్యూ ఎకో టూరిజం, పట్టణాల్లో తాగునీరు, గృహ నిర్మాణ శాఖ సేవలపై సంతృప్తి కానరావడం లేదు. జిల్లాలో పరిస్థితులు అటువంటివని జిల్లా అధికారులు మదనపడుతున్నారు.
నీటి తీరువాకు అడ్డంకులెన్నో
నీటితీరువా చెల్లించడానికి రైతులు నానా యాతన పడుతున్నారు. గతంలో చెల్లించిన నీటి తీరువాను వీఆర్‌వోల స్థాయిలో పక్కదారి పట్టాయి. రికార్డులు సవ్యంగా లేవు. ప్రస్తుతం నీటి తీరువాను సచివాలయాల్లో చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పన్ను చెల్లిస్తేనే సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈసీ ఇస్తారు. దాని ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తుంటాయి. మరోవైపు నీటి తీరువా చెల్లిస్తే రైతులు భూమిపై తమ హక్కు ఉన్నట్టుగా భావిస్తారు. ఇప్పుడు నీటి తీరువా వసూళ్లలోనూ జిల్లా వెనుకబాటు కనిపిస్తోంది.
సిఫారసులకే పెద్దపీట
సామాన్యులు రెవెన్యూ సిబ్బంది వద్దకు వెళితే క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారం గగనమై పోతుంది. భూ వివాదాల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోంది. భూమి మీద హక్కులేని వారు, పత్రాలు లేని వారు కూడా కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవిన్యూ అధికారులను ఆశ్రయిస్తే నెలల తరబడి తిరగాల్సి వస్తోంది. నేతల సిఫా రసులకే పెద్దపీట వేస్తున్నారు. సామాన్యులకు సమస్య పరిష్కారం కావడం గగనమై పోతోంది. తప్పయినా సరే నేతలు చెపితే రెవెన్యూ శాఖలో ఒప్పయిపోతున్నాయన్న విమర్శలు సాధారణమైపోయాయి. ఇది కూడా జిల్లాలో రెవెన్యూ శాఖపై ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. రికార్డుల పరిష్కారంలోనూ జాప్యం చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో రికార్డుల పరిష్కారంలో ఒక రోజులోనే ముగిస్తుంటే జిల్లాలో ఒక ఫైలు పరిష్కారానికి నాలుగు రోజుల వ్యవధి పడుతోంది, ఇవన్నీ రెవెన్యూ శాఖపై జనాల్లో అసంతృప్తి బీజాలు నాటేశాయి.
మెడకు చుట్టుకున్న రీసర్వే
గత ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వే సమస్యలు జిల్లాలో ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు 40 వేల జాయింట్ ఎల్‌పీ నంబర్‌లు నమోదయ్యాయి. అందులో ఇప్పటి దాకా 23 వేలు పరిష్కరించారు. ఆక్వా చెరు వులు విస్తరించడం వల్లే అప్పట్లో హద్దులు కానరాక జాయింట్ ఎల్‌పీ నెంబర్‌లు ఇచ్చారు. ప్రస్తుతం వాటి పరి ష్కారంలో అఽధికారులు కుస్తీ పడుతున్నారు. అప్పట్లో భూ విస్తీర్ణం తగ్గినట్టు చూపారు. హద్దులు మారిపోయాయి. ఇటువంటి తప్పిదాలు రెవెన్యూ శాఖను వెంటాడుతున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంలోనూ ఇది ఇబ్బందికరంగా మారింది. రైతులు ఇతర రాష్ర్టాల్లోనూ, జిల్లాల్లోనూ ఉంటున్నారు. వారందరినీ రప్పించి ఎల్‌పీ నంబర్ల సమస్యలు పరిష్కరించాలి. మరోవైపు పట్టాదారు పుస్తకాలు ఉన్నా సరే కొన్ని రెవెన్యూ గ్రామాల్లో ఇప్పటికీ ఇవ్వలేకపోయారు. నిర్ణీత గడువులో రైతులు అందుబాటులో లేరు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రతి నెలా మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తోంది. రైతులకు నమూనా పాస్ పుస్తకాన్ని మొబైల్‌లో చూపిస్తున్నారు. అంతా సవ్యంగా ఉందంటే ఈ–కెవైసీ తీసుకుంటున్నారు. ఆ తర్వాతే ముద్రణకు వెళుతున్నాయి.