Share News

చింత దిగుబడి అంతంతే!

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:28 PM

ఈ ఏడాది గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో చింతపండు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది.

     చింత దిగుబడి అంతంతే!

- మద్దతు ధర పెంచాలని కోరుతున్న గిరిజనులు

గుమ్మలక్ష్మీపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో చింతపండు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. ఈ రెండు మండలాల్లోని అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున చింతచెట్లు ఉన్నాయి. గిరిజనులు ఈ చెట్ల నుంచి చింతపండును సేకరించి గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు, ఇతర వ్యాపారులకు అమ్మతుంటారు. వేసవిలో చింతపండు సేకరణే గిరిజనులకు ముఖ్య జీవనాధారం. ప్రతి సంవత్సరం గిరిజన సహకార సంస్థ గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల నుంచి సుమారు ఆరు వేల క్వింటాళ్ల చింతపండును సేకరిస్తుంది. అయితే, ఈ ఏడాది ఆశించిన విధంగా చింతపండు లేదని, దిగుబడి తగ్గుతుందని గిరిజనులు చెబుతున్నారు. జీసీసీ కిలో చింతపండు ధర రూ.50గా నిర్ణయించి కొనుగోలు చేస్తే తమకు ఉపయోగకరంగా ఉంటుందని, గిట్టుబాటు అవుతుందని గిరిజన రైతులు అంటున్నారు. ఈ ఏడాది పంట ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో ధర పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చింతపండుకు పిక్క తీసే కార్యక్రమం చేపడితే తమకు ఉపాధి దొరుకుతుందని, ఈ మేరకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయమై గుమ్మలక్ష్మీపురం జీసీసీ మేనేజర్‌ ఎస్‌.రామును వివరణ కోరగా.. ‘గిరిజన సహకార సంస్థ ద్వారా ఈ ఏడాది కూడా చింతపండు కొనుగోలు చేస్తాం. ఉన్నతాధికారులు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తారు.’ అని తెలిపారు.

Updated Date - Jan 19 , 2026 | 11:28 PM