Share News

The laughter of passengers ప్రయాణికుల హాహాకారాలు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:39 PM

The laughter of passengers ఆ ఆర్టీసీ పాసింజర్‌ బస్సు రాజాం నుంచి విజయనగరం వెళుతోంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సెంటర్‌ వద్దకు చేరగానే ఒక్కసారిగా అదుపు తప్పింది.

The laughter of passengers ప్రయాణికుల హాహాకారాలు

ప్రయాణికుల హాహాకారాలు

ఓ పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు

ఒక్కసారిగా అరుపులు, కేకలు

డ్రైవర్‌కు పిట్స్‌ రావడంతో ప్రమాదం

అప్పన్నవలస సెంటర్‌ వద్ద ఘటన

ఆరుగురికి స్వల్ప గాయాలు

గరివిడి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఆ ఆర్టీసీ పాసింజర్‌ బస్సు రాజాం నుంచి విజయనగరం వెళుతోంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సెంటర్‌ వద్దకు చేరగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ఉన్నఫలంగా అటుఇటు కదలడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. వారు గమనించే లోపే ఓ పక్కకు పూర్తిగా ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. భయంతో కేకలు వేశారు. డ్రైవర్‌కు పిట్స్‌ రావడంతో అదుపు తప్పి క్షణాల్లో ఒరిగిపోయింది. బస్సు నెమ్మదిగా వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

రాజాం నుంచి ఏపీ03 జెడ్‌ 5033 నంబరు గల ఆర్టీసీ బస్సు విజయనగరానికి సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో బయలుదేరింది. గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సెంటర్‌ వద్దకు చేరినప్పటికి 11 గంటల సమయంలో డ్రైవర్‌ పి.అప్పలగురువులకు పిట్స్‌ వచ్చింది. దీంతో స్టీరింగ్‌ ఆయన అదుపులో లేకపోయింది. క్షణాల్లో రోడ్డుకు ఆనుకొని ఉన్న పంట పొలాల్లోకి బస్సు ఒరిగిపోయింది. అప్పటికి బస్సులో 85 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన సమయంలో లోపల ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. బస్సు నెమ్మదిగా ప్రయాణించడంతో ఆరుగురు ప్రయాణికులకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గరివిడి ఎస్‌ఐ బి.లోకేశ్వరరావు, సీఐ శంకరరరావు హుటాహుటిన సిబ్బందితో చేరుకొని స్థానికుల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్వల్ప గాయాలైన వారిని 108 ద్వారా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ బస్సును నెమ్మదిగా నడుపుతుండడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. చిన్నపాటి గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. గరివిడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:39 PM