బయోటెక్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:08 AM
కొప్పెర్ల పంచాయతీ పరిధిలోగల విజయనగర్ బయోటెక్ పరిశ్రమ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది.
మృతదేహంతో కార్మికుల ఆందోళన
పూసపాటిరేగ, జనవరి 22(ఆంధ్రజ్యోతి): కొప్పెర్ల పంచాయతీ పరిధిలోగల విజయనగర్ బయోటెక్ పరిశ్రమ వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. కొప్పెర్ల గ్రామానికి చెందిన తమిరి రవి(45)ని ఇదే పరిశ్రమవారు ఒడిశాలో నూతనంగా నిర్మించిన పరిశ్రమకు పంపించారు. దీంతో బుధవారం రాత్రి ఆయన పరిశ్రమలో అనారోగ్య కారణంతో మృతిచెందారు. కుటుంబీకులకు సమాచారం అందజేయకుండా విజయనగరం తీసుకువచ్చి, అక్కడి నుంచి అతడి స్వగ్రామం కొప్పెర్ల తీసుకొచ్చారు. తన భర్త మృతదేహాన్ని చూసిన భార్య శరద, అతని ముగ్గురు పిల్లలు బోరున విలపించారు. ఒడిశాలో ఉన్న పరిశ్రమలో సమయానికి చికిత్స అందకపోవటం వల్లే రవి మృతిచెందినట్టు కార్మికులు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని కూడా ఇక్కడ నుంచి ఒడిశాలో పరిశ్రమకు తీసుకు వెళ్లడం వల్లే ఇలా జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబా నికి నష్టపరిహారం చెల్లించాలంటూ గురువారం ఉదయం కార్మికులు, గ్రామస్థు లు పరిశ్రమ ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. సీఐ రామకృష్ణ, పోలీసులు పరిశ్రమకు చేరుకున్నారు. నష్ట పరిహారం విషయమై గ్రామపెద్దలు, టీడీపీ నాయకులు పరిశ్రమ ప్రతినిధులతో చర్చలకు దిగారు. దీంతో మృతుడి కుటుంబానికి రూ.17లక్షల నష్ట పరిహారం తోపాటు మృతుడి భార్యకు పరిశ్రమలో ఉద్యోగం, ముగ్గురు పిల్లలకు విద్యను అందజేస్తామని పరిశ్రమ అంగీకరించటంతో సమస్య సద్దుమణిగింది.