Share News

‘పూర్వోదయం’తో సస్యశ్యామలం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:48 AM

: సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయం పథకంతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుంది.

‘పూర్వోదయం’తో  సస్యశ్యామలం
లైనింగ్‌ లేక తుప్పలతో నిండిన తోటపల్లి కుడి ప్రధాన కాలువ

- రూ.3,962 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన

- జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం

- రెండేళ్లలో పూర్తికానున్న పెండింగ్‌ పనులు

చీపురుపల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వోదయం పథకంతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం కానుంది. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సుమారు రూ.3,962 కోట్లు మంజూరు కానున్నాయి. దీంతో జిల్లాలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు మోక్షం కలగనుంది. ఈ నిధుల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేశారు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్‌ పూర్తి చేసుకొని, ముఖ్యమంత్రి అంగీకారం తెలిపితే, కొద్ది నెలల్లోనే కేంద్రం నుంచి నిధులు విడుదల కానున్నాయి. జిల్లాతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు సాగు, తాగు నీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి, తారకరామతీర్థ సాగర్‌, గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులను ఈ పథకం కింద పూర్తి చేయడం కోసం అధికారులు ప్రతిపాదనల్ని తయారు చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో 3.94 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. మూడు జిల్లాల్లోని 1,280 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగు నీరు కూడా ఈ ప్రాజెక్టు నుంచి సరఫరా కానుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.2,672 కోట్లు అవసరమవుతాయని, అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అదే విధంగా 60 ఎకరాల స్థిరీకరణతో పాటు కొత్తగా 1.24 లక్షల ఎకరాలకు సాగు నీరందించే తోటపల్లి ప్రాజెక్టు పనులు గత ఐదేళ్లుగా పడకేశాయి. కుడి ప్రధాన కాలువ పరిధిలో ఉన్న పిల్ల కాలువల తవ్వకం, ప్రధాన కాలువలకు లైనింగ్‌, ఇతర చిన్నపాటి పెండింగ్‌ పనులకు సబంధించిన భూ సేకరణ తదితర పనుల కోసం దాదాపు రూ.263 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అనుసంధానంగా చీపురుపల్లి వద్ద తవ్విన గజపతినగరం బ్రాంచి కెనాల్‌ పనులు కూడా ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. నాగావళి జలాలను కుడి ప్రధాన కాలువ ద్వారా చీపురుపల్లి మీదుగా గజపతినగరం తరలించాలని 2009లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసి, డీపీఆర్‌ సిద్ధం చేసింది. అయితే, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ పనులకు చిల్లి గవ్వ కూడా కేటాయించకపోవడంతో గజపతినగరం కెనాల్‌ పనులు చీపురుపల్లి సమీపంలోనే నిలిచిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ ప్రాజెక్టుగా గుర్తించి, నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో గజపతినగరం ప్రాంతంలోని 15 వేల ఎకరాల భూములకు సాగు నీరందించేందుకు మార్గం సుగమం కానుంది. అదే విధంగా గుర్ల మండలంలోని ఆనందపురం గ్రామానికి సమీపంలో నిర్మించిన తారకరామతీర్థ రిజర్వాయర్‌ గత 18 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లిమర్ల నియోజకవర్గంలోని 8,172 ఎకరాల స్థిరీకరణతో పాటు కొత్తగా 16 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పూర్వోదయం పథకంతో మోక్షం కలగనుంది. ఈ పథకం ద్వారా నిధులను రప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. సకాలంలో నిధులు చేరితే రానున్న రెండేళ్లలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తయి జిల్లాలోని భూములు సస్యశ్యామలం కానున్నాయి.

Updated Date - Jan 26 , 2026 | 12:48 AM